ఈ ఏడాది నైరుతీ రుతుపవనాలు సాధారణం

 


ఈ ఏడాది నైరుతీ రుతుపవనాలు సాధారణంగా ఉండనున్నాయి. భారతీయ వాతావరణశాఖ ఈ విషయాన్ని చెప్పింది. నైరుతీ రుతుపవనాలు 98 శాతం సాధారణం ఉండే అవకాశాలు ఉన్నట్లు కేంద్ర భూగర్భ మంత్రిత్వశాఖ కార్యదర్శి రాజీవన్ తెలిపారు. ప్రతి ఏడాది జూన్ ఒకటి నాటికి నైరుతీ రుతుపవనాలు కేరళలో ప్రవేశిస్తాయన్న విషయం తెలిసిందే. నైరుతీ రుతుపవనాల వల్ల దేశవ్యాప్తంగా వర్షాలు కురుస్తాయి. గత ఏడాది సగటు కన్నా ఎక్కువ స్థాయిలో దేశమంతా వర్షపాతం నమోదైంది. ఇండియాలో వర్షాకాలం జూన్ నుంచి సెప్టెంబర్ మధ్య కాలంలో వస్తుంది. అయితే ఈ సారి ఆ సమయంలో వర్షపాతం 96 నుంచి 104 శాతం ఉంటుందని ఐఎండీ తన ప్రకటనలో పేర్కొన్నది. కానీ సగటున ఆ వర్షపాతం 98 శాతం ఉండే అవకాశాలు ఉన్నట్లు పేర్కొన్నది. లాంగ్ పీరియడ్ యావరేజ్ ఆధారంగా ఈ అంచనా వేస్తారు. వర్షాకాలంలో కురిసే సగటు వర్షం 1961 నుంచి 2010 మధ్య 88 సెంటీమీటర్లు ఉన్నది. పసిఫివ్‌, హిందూ మహాసముద్రాల్లో ప్రస్తుతం ఉన్న ఉష్ణోగ్రతల ఆధారంగా ఈ అంచనా వేస్తున్నారు. ఈ రెండు సముద్రాల ఉష్ణోగ్రతలు .. భారతీయ రుతుపవనాలపై ప్రభావం చూపనున్నాయి. అయితే మరోసారి రుతుపవనాలపై మే నెల చివర్లో ఐఎండీ అప్‌డేట్ ఇవ్వనున్నది.