డీజిల్‌ బస్సులకు టీఎస్‌ ఆర్టీసీ స్వస్తి

 


డీజిల్‌ బస్సులకు టీఎస్‌ ఆర్టీసీ స్వస్తి పలకనుందా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. రోజురోజుకూ డీజిల్‌ ధరలు పెరుగుతుండటం.. ఎలక్ట్రిక్‌తో ఖర్చు ఆదా అవుతుండటంతో డీజిల్‌ బస్సులను కన్వర్షన్‌ చేయాలని నిశ్చయించింది. ఆర్టీసీ యాజమాన్యం వద్ద అధికంగా ఉన్న డీజిల్‌ బస్సుల స్థానంలో ఎలక్ట్రికల్‌ బస్సులను తెచ్చే ప్రయత్నం చేస్తోంది. అయితే డిజీల్‌ బస్సులను పూర్తిగా తొలగించి ఎలక్ట్రికల్‌ బస్సులను కొనుగోలు చేసే శక్తి ఆ సంస్థకు లేదు. దీంతో ప్రత్యామ్నాయ ఆలోచన చేసింది. ఇప్పుడు తిరుగుతున్న డీజిల్‌ బస్సులను ఎలక్ట్రికల్‌ బస్సులుగా మార్చే అవకాశాలపై దృష్టి పెట్టింది. తక్కువ ఖర్చుతో అన్ని బస్సులను ఎలక్ట్రికల్‌ బస్సులుగా కన్వర్షన్‌ చేయాలని నిశ్చయించింది. ఇందులో భాగంగా బెంగళూరుకు చెందిన ఓ ప్రైవేట్‌ సంస్థతో గత నెలలో ఆర్టీసీ ఉన్నతాధికారులు సంప్రదింపులు జరిపారు. ప్రయోగాత్మకంగా తొలుత ఓ డీజిల్‌ బస్సును ఈవీగా మార్చేయనున్నారు. ఈ ప్రయోగం దేశంలో మొదటిది కానున్నదని ఆర్టీసీ అధికారులు అంటున్నారు. ఈ ప్రయోగం విజయవంతమైతే జీహెచ్‌ఎంసీ పరిధిలోని అన్ని బస్సులు ఎలక్ట్రికల్‌ బస్సులుగా మార్చుతారు. ఆ తర్వాత సాధ్యాసాధ్యాలను పరిశీలించి దశల వారీగా జిల్లాల్లోని అన్ని బస్సులు ఈవీలుగా మార్చే అవకాశాలున్నట్లు అధికారులు అంచనా వేస్తున్నారు.


కిలో మీటర్‌కు రూ.12 ఆదాయం..


ఆర్టీసీ ఆధ్వర్యంలో నడుస్తున్న డీజిల్‌ బస్సుపై ప్రతి కిలోమీటర్‌కు రూ.18 వరకు ఖర్చు వస్తుంది.

అదే ఎలక్ట్రికల్‌ బస్సయితే ప్రతి కిలోమీటర్‌కు రూ.6 మాత్రమే ఖర్చు అవుతుందని అధికారులు లెక్కలు కట్టారు.

దీంతో దాదాపు రూ.12 ఆదాయం వచ్చే అవకాశం ఉంటుందని బెంగళూరు సంస్థ ప్రతిపాదనలు సిద్ధం చేసినట్టు సమాచారం.

ఆర్థిక భారం లేకుండానే..


డీజిల్‌ బస్సులను ఎలక్ట్రికల్‌గా మార్చే ప్రయోగానికి భారీగా ఖర్చు కానున్నట్లు సమాచారం.

ఈ భారం ఆర్టీసీపై పడకుండానే ప్రయోగాత్మకంగా చేపట్టిన ఈ ప్రాజెక్టు వ్యయాన్ని బెంగళూరుకు చెందిన ఎఎంఎస్‌ ఎలక్ట్రిక్‌ మొబిలిటీ లిమిటెడ్‌ భరించనున్నది.

ఈ ప్రయోగం సక్సెస్‌ అయితే కావాల్సిన అన్ని అనుమతులను ప్రభుత్వం నుంచి ఆర్టీసీ పొందనుంది.

ఆటోమొబైల్‌ రీసెర్చ్‌ అసోసియేషన్‌ ఆఫ్‌ ఇండియా (ఏఆర్‌ఏఐ) నుంచి కూడా అనుమతులు తీసుకోనున్నది.

ఈ ప్రక్రియకు ఒక్క బస్సుపై ఎంత ఖర్చు వస్తుంది? ఇది ఆర్టీసీ భరించే విధంగా ఉంటుందా? లేదా అన్న అంశాలను అధ్యయనం చేసి, సాధ్యాసాధ్యాలను పరిశీలించిన తర్వాత పూర్తి నిర్ణయం తీసుకోనున్నారు.

గంట చార్జ్‌కు 160 కిలో మీటర్లు..


ఎలక్ట్రికల్‌గా మారిన బస్సులను గంటసేపు చార్జ్‌ చేస్తే దాదాపు 160 నుంచి 200 కిలోమీటర్ల వరకు ప్రయాణించనున్నాయి.

ప్రస్తుతం మహానగరంలోని 29 డిపోల పరిధిలో మొత్తం 2884 బస్సులున్నాయి.

ఈ బస్సులకు బ్యాటరీలు అమర్చడంతో పాటు అన్ని డిపోల పరిధిలో చార్జింగ్‌( బ్యాటరీ చార్జింగ్‌) యంత్రాలను అధికారులు ఏర్పాటు చేయనున్నారు.