హనుమాన్ జయంతి సందర్భంగా ప్రధాని మోదీ శుభాకాంక్షలు

 


హనుమాన్ జయంతి సందర్భంగా ప్రధాని మోదీ, హోం మంత్రి అమిత్‌షా, కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ, తదితరులు దేశ ప్రజలకు మంగళవారంనాడు వరుస ట్వీట్లలో శుభాకాంక్షలు తెలిపారు. అపార కరుణ, అంకితభావానికి ప్రతీక హనుమాన్ జయంతి అని, కరోనాపై జరుపుతున్న పోరాటంలో ఆంజనేయుని ఆశీస్సులు అందరపై ఉండాలని కోరుకుంటున్నానని ఓ ట్వీట్‌లో పేర్కొన్నారు. హనుమంతుని జీవితం, ఆదర్శభావాలు మనకు ఎల్లవేళలా స్ఫూర్తిగా నిలుస్తాయని అన్నారు. కేంద్ర హోం మంత్రి అమిత్‌షా మరో ట్వీట్‌లో దేశ ప్రజలకు హనుమాన్ జయంతి శుభాకాంక్షలు తెలిపారు. సంకట విమోచనుడు అందరి కష్టాలను తొలగించి, కరోనా మహమ్మారిని ఎదుర్కొనే శక్తిని దేశ ప్రజలందరికీ ప్రసాదించాలని కోరుకుంటున్నానని ఆ ట్వీట్‌లో పేర్కొన్నారు.

కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ హనుమాన్ ఫోటోను జోడించి దేశప్రజలకు శుభాకాంక్షలు తెలియజేశారు. 'హ్యాపీ హనుమాన్ జయంతి టు ఆల్' అంటూ ట్వీట్ చేశారు. రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ సైతం దేశప్రజలకు హనుమాన్ జయంతి శుభాకాంక్షలు తెలిపారు. ప్రతి ఒక్కరూ తమ జీవితంలో ఎదురయ్యే సంక్షోభాల నుంచి బయట పడి, ఆయురారోగ్యాలతో ఉండాలని హనుమంతుని ప్రార్థిస్తున్నట్టు ఆయన ట్వీట్ చేశారు. ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ 'హనుమాన్ చాలీసా' లోని రెండు శ్లోకాలను ప్రస్తావిస్తూ, అందరికీ బలం, బుద్ధి, తెలివితేటలు, ఆరోగ్యం ప్రసాదించాలని భగవంతుని కోరుకుంటున్నట్టు ట్వీట్ చేశారు.