india, pak మధ్య నెలకొన్న ప్రతిష్టంభన

 


 india, pak మధ్య నెలకొన్న ప్రతిష్టంభనను తొలగించేందుకు ఇరు దేశాల ఇంటెలిజెన్స్ అధికారులు ఈ ఏడాది జనవరిలో రహస్యంగా సమావేశమైనట్టు తెలుస్తోంది. ఈ చర్చలతో సంబంధం ఉన్న వర్గాలు ఈ విషయాలను వెల్లడించాయి. 2019లో పుల్వామాలో భారత దళాలపై జరిగిన 'ఉగ్ర'దాడి తరువాత భారత్-పాక్ దౌత్య సంబంధాలు దెబ్బ తిన్న విషయం తెలిసిందే. ఈ దాడి వెనుకు పాక్ ప్రేరేపిత ఉగ్రవాదులు ఉన్నారన్న విషయం బయటపడటంతో మోదీ ప్రభుత్వం యుద్ధవిమానాలను రంగంలోకి దింపి..ఉగ్ర శిక్షణ శిబిరాలను ధ్వంసం చేసింది. ఆదే ఏడాది..భారత ప్రభుత్వం కశ్మీర్‌కు స్వయంప్రతిపత్తిని ఇచ్చే ఆర్టికల్ 370నీ రద్దు చేసింది. ఈ పరిణామాలతో పాకిస్థాన్ అగ్గిమీద గుగ్గిలమైంది. భారత్‌తో దౌత్య సంబంధాలను తెంచుకున్నట్టు అధికారికంగా ప్రకటించింది. అంతేకాకుండా.. ద్వైపాక్షిక వాణిజ్యాన్ని కూడా నిలిపివేసింది.

అయితే ఈ స్థితిని చక్కదిద్దేందుకు ఇరు దేశాలూ తెరవెనుక చర్చలు చేపడుతున్నాయని విశ్వసనీయ వర్గాలు చెబుతున్నాయి. పాక్ గూఢచార సంస్థ ఐఎస్ఐకి చెందిన అధికారులు, భారత నిఘా సంస్థ 'రా' అధికారులు ఇటీవల దుబాయ్‌లో సమావేశమై ఈ అంశాలను చర్చించారట. ఈ సమావేశం ఏర్పాటు వెనుకు యూఏఈ ప్రభుత్వం కృషి కూడా ఉందని తెలసింది. ఈ మేరకు ప్రముఖ అంతర్జాతీయ వార్త సంస్థ ఓ కథనాన్ని ప్రచురించింది. అయితే..భారత ప్రభుత్వం ఈ వార్తలపై ఇప్పటివరకూ అధికారికంగా స్పందించలేదు.

కాగా.. భారత్, పాక్ ఉన్నతాధికారులు గత కొద్ది నెలలుగా వివిధ దేశాల్లో రహస్యంగా సమావేశమవుతూ చర్చలు జరుపుతున్నారని పాక్ రక్షణ రంగ విశ్లేషకురాలు అయోషా సిద్దీకా తెలిపారు. 'ఇరు దేశాల ఉన్నతాధికారులు..థాయ్‌ల్యాండ్, లండన్, దుబాయ్‌లలో సమావేశమయ్యారని నేను అనుకుంటున్నా' అని ఆమె వ్యాఖ్యానించారు. 'ఈ చర్చలు విఫలమయ్యే అవకాశం ఇప్పటికీ ఉంది. అందుకే..దీనిపై బహిరంగంగా ఎవరూ స్పందించట్లేదు. ఇవేమీ శాంతిచర్చలు కావు. ఆ మాటకొస్తే..ఈ సమావేశాలకు అసలు పేరే లేదు.' అని ఈ వ్యవహారంతో సంబంధం ఉన్న మరో వ్యక్తి వ్యాఖ్యానించారు.

ఈ రహస్య చర్చలు ప్రారంభించడానికి భారత్,పాక్‌లకు ముఖ్యమైన కారణాలే ఉన్నాయని రక్షణ రంగం విశ్లేషకులు చెబుతున్నారు. చైనాతో భారత్‌కు ఉన్న వివాదం ఇప్పటికీ పూర్తిగా సద్దుమణగలేదు. ఈ పరిస్థితుల్లో పాక్‌తో నెలకొన్న వివాదం సుదీర్ఘకాలం పాటు కొనసాగడం భారత్‌కు ఇష్టంలేదు. మరోవైపు.. పాక్ ఆర్థిక వ్యవస్థ తల్లకిందులవడం అక్కడి ప్రభుత్వం కూడా ఇక్కట్లు పడుతోంది. ఈ పరిస్థితుల్లో భారత్‌తో వివాదం అదుపుతప్పకుండా ఉండేందుకు ప్రయత్నిస్తోంది. ఇక అప్ఘానిస్థాన్ నుంచి అమెరికా తన సేనలు ఉపసంహరించుకుంటున్న నేపథ్యంలో అప్ఘాన్-పాక్ సరిహద్దు వద్ద పరిస్థితులను అదుపులో ఉంచేందుకు పాక్ తంటాలు పడుతోంది. ఈ నేపథ్యంలో ఇరు దేశాలు తమ మధ్య నెలకొన్న వివాదాన్ని సామరస్యంగా పరిష్కరించుకునేందుకు మొగ్గు చూపుతున్నట్టు విశ్లేషకులు చెబుతున్నారు.