హిందీలో నటిస్తుండటం వలన నిర్మాతలకు లాభo :నాగార్జున

 


''బాలీవుడ్‌లో కెరీర్‌ కోసం నేనేమీ కలలు కనలేదు. ఉత్తరాది ప్రేక్షకులు నన్ను ఆదరించాలని, హిందీలో నాకు స్టార్‌డమ్‌ రావాలని ఆరాటపడలేదు. అందుకని, నా హిందీ సినిమాల మధ్య విరామం ఎక్కువగా ఉంటుంది'' అని నాగార్జున అన్నారు. ప్రస్తుతం ఆయన నటిస్తున్న హిందీ చిత్రం 'బ్రహ్మాస్త్ర'. పదిహేడేళ్ల విరామం తర్వాత నాగార్జున హిందీలో చేస్తున్న చిత్రమిది. ఇకపై హిందీ చిత్రాల్లో ఎక్కువ కనిపించే అవకాశం ఉందా? అని అడిగితే... మంచి అవకాశం వస్తే నటించడానికి తాను సిద్ధమనీ, అయితే తెలుగు సినిమాలతో సంతోషంగా ఉన్నానని ఆయన పేర్కొన్నారు.


హిందీలో నటిస్తుండటం వలన నిర్మాతలకు లాభమని ఆయన అభిప్రాయపడ్డారు. ''తమిళనాడు, కేరళ, కర్ణాటక, ముంబై... ప్రాంతాల్లో నా సినిమాలను చూస్తారు. దానివల్ల నిర్మాతకు ఇంకొంచెం ఎక్కువ డబ్బులు వస్తాయి కనుక సినిమా తీసేటప్పుడు కొంచెం ఎక్కువ ఖర్చుపెడతారు'' అని నాగార్జున చెప్పారు. 'బ్రహ్మాస్త్ర' గురించి మాట్లాడుతూ ''సినిమాలో అమితాబ్‌ బచ్చన్‌ ఉన్నప్పటికీ... రణ్‌బీర్‌ కపూర్‌, ఆలియా భట్‌ కాంబినేషన్‌లో నాకు ఎక్కువ సీన్లు ఉన్నాయి. నాది ప్రత్యేక పాత్ర అయినప్పటికీ... చిత్రదర్శకుడు అయాన్‌ ముఖర్జీ, నిర్మాత కరణ్‌ జోహార్‌ 'కథ రాసేటప్పుడు ఈ పాత్రకు మిమ్మల్నే అనుకున్నాం' అని చెప్పారు. నాకూ పాత్ర నచ్చింది. సంతోషంగా అంగీకరించా'' అని తెలిపారు.