కరోనా నిబంధనలు పాటిస్తూ జూలైలో ఆయా పరీక్షలను నిర్వహించనున్న సీబీఎస్ఈ, 12వ తరగతి పరీక్షలు

     

కరోనా నేపథ్యంలో టెన్త్ ఎగ్జామ్స్ ను రద్దు చేసిన సీబీఎస్ఈ, 12వ తరగతి పరీక్షలను మాత్రం వాయిదా వేసింది. అయితే ఈ పరీక్షలు రద్దు చేయాలని విద్యార్థులు, తల్లిదండ్రుల నుంచి విపరీతమైన డిమాండ్ వచ్చింది. సోషల్ మీడియా ద్వారా విద్యార్థులు తమ అభిప్రాయాలను ప్రభుత్వం దృష్టికి తీసుకుపోయారు విద్యార్థులు. ఈ కరోనా పరిస్థితుల్లో పరీక్షలు నిర్వహించడం సరికాదని వారు ఆందోళన వ్యక్తం చేశారు.


అయితే నిన్న సీబీఎస్ఈ పరీక్షలతో పాటు నీట్, జేఈఈ తదితర పరిక్షల నిర్వహణ అంశంపై కేంద్ర రక్షణ శాఖ మంత్రి ఆధ్వర్యంలో ఉన్నత స్థాయి సమావేశం జరిగింది. ఈ సమావేశంలో కేంద్ర విద్యాశాఖ మంత్రి రమేష్ పోఖ్రియాల్, స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి స్మృతీ ఇరానీతో పాటు ఆయా రాష్ట్రాల విద్యాశాఖ మంత్రులు, అధికారులు పాల్గొన్నారు. ఈ సమావేశాన్ని వర్చువల్ విధానంలో నిర్వహించారు. పరీక్షలు నిర్వహించాలా? వద్దా? అన్న అంశంపై సమావేశంలో చర్చించారు. అయితే సీబీఎస్ఈ బోర్డుతో పాటు కేంద్ర ప్రభుత్వం సైతం పరీక్షలను నిర్వహించడానికే మొగ్గు చూపినట్లు సమాచారం. కరోనా నిబంధనలు పాటిస్తూ జూలైలో ఆయా పరీక్షలను నిర్వహించనున్నట్లు తెలుస్తోంది.