భారత్ వేదికగా మొదలైన ఐపీఎల్-14 కరోనా కారణంగా అర్ధంతరంగా నిలిచిపోయిన సంగతి తెలిసిందే. 29 మ్యాచ్‌లు మాత్రమే జరిగాయి. అయితే నిరవధికంగా వాయిదా పడ్డ ఈ టోర్నీలోని మిగతా మ్యాచ్‌లను యూఏఈలో నిర్వ
హించాలని బీసీసీఐ యోచిస్తోంది. ఈ నెల 29న జరిగే ప్రత్యేక సర్వసభ్య సమావేశంలో వేదిక, తేదీలను బోర్డు ఖరారు చేసే అవకాశముంది. ఇంగ్లాండ్‌లో టీమ్ఇండియా పర్యటన ముగిసిన తర్వాత సెప్టెంబరు-అక్టోబరులో టోర్నీని నిర్వహించడానికి బోర్డుకు వీలవుతుందని తెలుస్తోంది. ఇంగ్లాండ్‌తో టెస్టు సిరీస్ సెప్టెంబరు 14న ముగుస్తుంది. ఆ తర్వాత టీ20 ప్రపంచకప్ (అక్టోబరు-నవంబరు) వరకు భారత్‌కు సిరీస్‌లేమీ లేవు. ఈ సమయాన్ని ఉపయోగించుకుని సెప్టెంబరు 15 నుంచి అక్టోబరు 15 వరకు యూఏఈలో ఐపీఎల్‌ను నిర్వహించాలని బీసీసీఐ భావిస్తోంది. రెండు, మూడో టెస్టు మధ్య వ్యవధిని 9 నుంచి నాలుగు రోజులకు తగ్గించాలని ఇప్పటికే ఇంగ్లాండ్ క్రికెట్ బోర్డును కోరింది. దీని వల్ల భారత్, ఇంగ్లాండ్ క్రికెటర్లను యూఏఈకి తరలించడానికి బీసీసీఐకి మరింత సమయం లభిస్తుంది. ఒకవేళ ఇంగ్లిష్ బోర్డు అంగీకరించకపోతే.. మరో ప్రణాళికతో బోర్డు సిద్ధంగా ఉందట.