రాష్ట్రంలో జులై 15వతేదీ తర్వాత ఇంటర్ వార్షిక పరీక్షలు నిర్వహించేందుకు సిద్ధంగా ఉన్నామని రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర విద్యాశాఖకు తెలిపింది. పరీక్షల నిర్వహణపై లిఖితపూర్వకంగా అభిప్రాయాలు చెప్పాలని కేంద్రం కోరిన నేపథ్యంలో తెలంగాణ విద్యాశాఖ కార్యదర్శి సందీప్‌కుమార్ సుల్తానియా ఈ మేరకు కేంద్రానికి లేఖ రాశారు. జులై మధ్యలో పరీక్షలు మొదలుపెడతామని, ఆగస్టు చివరి నాటికి ఫలితాలు వెల్లడిస్తామని అందులో పేర్కొన్నారు. లేఖలో ఇంకా ఏమేం చెప్పారంటే..
ప్రశ్నలు తగ్గిస్తాం
* గతంలోనే ప్రశ్నపత్రాలు ముద్రణ పూర్తయినందున విధానాన్ని మార్చడం వీలుకాదు. పరీక్ష సమయాన్ని 3 గంటల నుంచి గంటన్నరకు తగ్గిస్తాం. సమయం తగ్గినందున రాయాల్సిన ప్రశ్నలనూ ఆ మేరకు తగ్గిస్తాం. దానివల్ల విద్యార్థులకు ఛాయిస్ పెరుగుతుంది. వచ్చిన మార్కులను 100కి లెక్కిస్తాం.
* సాధ్యమైనంత వరకు వ్యక్తిగత దూరం పాటించేలా చూస్తాం. అందుకు అనుగుణంగా వేర్వేరు ప్రశ్నపత్రాలతో ఉదయం, సాయంత్రం పరీక్షలు జరుపుతాం. దానివల్ల విద్యార్థుల సంఖ్య తగ్గుతుంది. కరోనా వ్యాప్తికి అవకాశం ఉండదు.
* కొవిడ్ లేదా ఇతర కారణాల వల్ల పరీక్షలు రాయలేని వారికి మరో అవకాశం ఇస్తాం.
ప్రయోగ పరీక్షలు వాయిదా
ఇంటర్ ద్వితీయ సంవత్సరం సైన్స్ విద్యార్థులకు ఈ నెల 29వ తేదీ నుంచి ప్రయోగపరీక్షలు నిర్వహిస్తామని గతంలో ప్రకటించిన ఇంటర్‌బోర్డు వాటిని వాయిదా వేసింది. జూన్ మొదటి వారంలో పరిస్థితిని సమీక్షించి, ఎప్పుడు నిర్వహించాలనే విషయమై నిర్ణయం తీసుకుంటామని ఇంటర్‌బోర్డు కార్యదర్శి జలీల్ గురువారం తెలిపారు. లాక్డౌన్ అమల్లో ఉండటం, కరోనా ఉద్ధృతి తగ్గకపోవడంతో వాయిదా నిర్ణయం తీసుకున్నట్టు చెప్పారు.