ఈ నెల 21న నైరుతి రుతుపవనాలు

 


ఈ నెల 21న నైరుతి రుతుపవనాలు దక్షిణ అండమాన్‌ సముద్రం, దాన్ని ఆనుకుని ఉన్న ఆగేయ బంగాళాఖాతంలోకి ప్రవేశించే అవకాశాలున్నాయని అమరావతి వాతావరణ కేంద్రం అధికారులు మంగళవారం తెలిపారు. ఈ నెల 23 నాటికి తూర్పు మధ్య బంగాళాఖాతం, దాని పరిసర ప్రాంతాల్లో ఒక అల్పపీడనం ఏర్పడే అవకాశాలున్నాయని పేర్కొన్నారు. ఏపిలో ఆగేయ, దక్షిణ గాలులు వీస్తున్నాయని, వీటి ప్రభావంతో రాగల 48 గంటల్లో ఉత్తర, దక్షిణ కోస్తా, రాయలసీమలోని పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు ఉరుములు, మెరుపులతో కురిసే అవకాశాలున్నాయని తెలిపారు. అదే సందర్భంలో ఉత్తర, దక్షిణ కోస్తా, రాయలసీమల్లో ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 2 నుంచి 3 డిగ్రీలు అధికంగా నమోదయ్యే అవకాశాలున్నాయని వెల్లడించారు.