హైదరాబాద్‌ నుంచి వెళ్లే 250 బస్సులను తెలంగాణ ఆర్టీసీ రద్దు    ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో డే కర్ఫ్యూ విధించడంతో హైదరాబాద్‌ నుంచి వెళ్లే 250 బస్సులను తెలంగాణ ఆర్టీసీ రద్దు చేసింది. ముందస్తు రిజర్వేషన్‌లు కూడా రద్దు అయ్యాయి. హైదరాబాద్‌ నుంచి ఏపీలోని విజయవాడ, కర్నూలు, శ్రీశైలం, బెంగళూరుకు వెళ్లే తెలంగాణ బస్‌ సర్వీసులన్ని నిలిచిపోయా యి. ఇప్పటికే కొన్ని బస్సు సర్వీసులను ఏపీకి నడిపినప్పటికీ గురువారం నుంచి 18వ తేదీ వరకు హైదరాబాద్‌ నుంచి వెళ్లే అన్ని బస్సులను పూర్తిగా నిలిపివేస్తున్నట్లు తెలంగాణ ఆర్టీసీ ఒక ప్రకటనలో పేర్కొంది.    ఏపీలో మధ్యాహ్నం 12 గంటల నుంచి కర్ఫ్యూ అమల్లో ఉంటుంది. ఏపీలో కర్ఫ్యూకు ముందే బస్సులు అక్కడికి చేరుకోవలసి ఉంటుంది. ఉదయం అక్కడికి చేరుకున్న బస్సులు తిరిగి మధ్యాహ్నం 12 లోపు రాష్ట్ర సరిహద్దులను దాటాల్సి ఉంటుంది. తెలంగాణలో రాత్రి 9 గంటల నుంచే కర్ఫ్యూ అమలవుతోంది. ఏపీ నుంచి బయల్దేరిన బస్సులు రాత్రి 9 గంటలలోపు డిపోలకు చేరుకోవడం సాధ్యం కాదని అధికారులు చెబుతున్నారు.    కోదాడ నుంచి విజయవాడ వరకు 6 బస్సులు నడుస్తున్నాయి. హైదరాబాద్‌ నుంచి బెంగళూరు వైపునకు వెళ్లే 48 బస్సు సర్వీసులు నిలిచిపోయాయి. ఏపీ సరిహద్దు జిల్లాల బస్సులు మాత్రం మధ్యాహ్నం 12 లోపు ఆయా డిపోలకు చేరుకునే పరిస్థితి ఉంటే నడిచే అవకాశం ఉంది.