వానాకాలంలో రాష్ట్రంలోని 28 వేల నీటి వనరుల్లో 93 కోట్ల చేపపిల్లల పంపిణీ

 


. వచ్చే వానాకాలంలో రాష్ట్రంలోని 28 వేల నీటి వనరుల్లో రూ.89 కోట్ల వ్యయంతో 93 కోట్ల చేపపిల్లలను వదలాలని నిర్ణయించినట్లు మత్స్యశాఖ మంత్రి తలసాని శ్రీనివాసయాదవ్‌ తెలిపారు. ఈ కార్యక్రమంపై గురువారం తన కార్యాలయంలో ఆయన అధికారులతో సమీక్ష జరిపారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. రొయ్యల పెంపకాన్ని కూడా ప్రోత్సహిస్తామని, ఈ సీజన్‌లో రూ.25 కోట్ల వ్యయంతో 10 కోట్ల రొయ్య పిల్లలను నీటివనరుల్లో వదులుతామన్నారు. పంపిణీకి అనువుగా ఉండే చేపపిల్లలను మాత్రమే కొనుగోలు చేయాలని స్పష్టం చేశారు. అవకతవకలు జరగకుండా వీటి కొనుగోలుకు మార్గదర్శకాలు రూపొందించి టెండర్లను 10 రోజుల్లో పిలవాలని సూచించారు. రాష్ట్రంలో చేపల పెంపకం చేపట్టేందుకు 34,024 చెరువులు అనువుగా ఉన్నాయని, వాటిలో 28,704 చెరువులను జియో ట్యాగింగ్‌ చేసినట్లు వెల్లడించారు. మిగిలిన వాటినీ అనుసంధానం చేసే పనులు జరుగుతున్నాయని వివరించారు. విజయ పాల ఉత్పత్తుల మాదిరిగా తెలంగాణ బ్రాండ్‌ పేరుతో చేపలు, చేప వంటకాల అమ్మకాలకు త్వరలో 500 విక్రయ కేంద్రాలను ఏర్పాటు చేయనున్నట్లు మంత్రి ప్రకటించారు. వీటితో నిరుద్యోగులకు ఉపాధి లభిస్తుందన్నారు.