జీఎస్టీ కౌన్సిల్‌ 43వ సమావేశం ...... రాష్ట్రాలకు పరిహారం

 


జీఎస్టీ కౌన్సిల్‌ 43వ సమావేశం శుక్రవారం జరుగనుంది. ఉదయం 11 గంటలకు వీడియోకాన్ఫరెన్స్‌ ద్వారా జరుగనుండగా.. సమావేశానికి కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌ అధ్యక్షతన వహించనున్నారు. కొవిడ్‌ మహమ్మారి సెకండ్‌ వేవ్‌ మధ్య రాష్ట్రాలకు పరిహారం, పలు మందులు, వైద్య పరికరాలు, ఆరోగ్య సేవలపై పన్ను మినహాయింపు తదితర కీలక అంశాలపై జీఎస్టీ కౌన్సిల్‌ చర్చించే అవకాశం ఉందని తెలుస్తోంది. ద్విచక్ర వాహనాలపై జీఎస్టీ తగ్గించడం, పెట్రోల్‌, డీజిల్‌ను జీఎస్టీలోకి తీసుకురావడంపై చర్చించే చర్చించనున్నట్లు తెలుస్తున్నది. జీఎస్టీ కౌన్సిల్‌ ఈ ఏడాదిలో తొలిసారిగా సమావేశమవుతోంది. చివరి సారిగా గతేడాది అక్టోబర్‌లో భేటీ అయ్యింది.

కరోనా మహమ్మారి నేపథ్యంలో రాష్ట్రాలకు పరిహారం, అవసరమైన వైద్య సామాగ్రిపై జీఎస్టీ సమస్యలపై ప్రస్తావించే అవకాశం ఉందని కేంద్ర వర్గాలు భావిస్తున్నాయి. పన్ను రేట్ల తగ్గింపుతోపాటు 2017లో వ్యాట్ స్థానంలో జీఎస్టీ అమలులోకి వచ్చినప్పుడు పరిహారం చెల్లిస్తామని రాష్ట్రాలకు కేంద్రం హామీ ఇచ్చింది. దాని ప్రకారం రాష్ట్రాలకు రూ.2.69 లక్షల కోట్ల మేరకు కేంద్రం పరిహారం చెల్లించాల్సిన అవసరం ఉంది. ఈ మేరకు బకాయిలపై పట్టుబట్టే అవకాశం ఉంది. మహమ్మారి నేపథ్యంలో వైద్య పరికరాలకు డిమాండ్‌ పెరిగింది. ఇప్పటికే పలు రాష్ట్రాలు జీఎస్టీ మినహాయించాలని డిమాండ్‌ చేశారు.


హ్యాండ్ శానిటైజర్లు, ఫేస్ మాస్క్‌లు, గ్లోవ్స్, పీపీఈ కిట్లు, ఆక్సిమీటర్లు, వెంటిలేటర్లుపై పన్ను మినహాయించాలని పంజాబ్ ఆర్థిక మంత్రి మన్‌ప్రీత్ సింగ్ బాదల్ కేంద్రాన్ని కోరారు. వ్యాక్సిన్లపై ఐదు శాతం జీఎస్టీని తొలగించడం ధరలను ప్రతికూలంగా ప్రభావితం చేస్తుందని ఇటీవల సీతారామన్ స్పష్టం చేశారు. వాటిపై పన్ను తగ్గిస్తే, ఔషధాల ధరలు పెరిగిపోతాయని పేర్కొన్నారు. కరోనా నేపథ్యంలో ద్విచక్ర వాహనాలపై జీఎస్టీ స్లాబ్‌ను తగ్గించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అలాగే జీఎస్టీ పరిధిలోకి పెట్రోల్‌, డీజిల్‌ను తీసుకువచ్చే అంశంపై చర్చించే అవకాశం ఉన్నది. ఈ వర్చువల్‌ మీటింగ్‌లో కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్, రాష్ట్రాల ఆర్థిక మంత్రులు, సీనియర్ అధికారులు పాల్గొనున్నారు.