పార్కింగ్‌ నిబంధనల ఉల్లంఘనపై జీహెచ్‌ఎంసీ కొరడా....50 వేల జరిమానా

 


 పార్కింగ్‌ నిబంధనల ఉల్లంఘనపై జీహెచ్‌ఎంసీ కొరడా ఝుళిపిస్తోంది. నిబంధనలకు విరుద్ధంగా పార్కింగ్‌ రుసుము వసూలు చేసిన రెండు సంస్థలకు రూ. 50 వేల చొప్పున జరిమానా విధించింది. ట్విటర్‌లో వచ్చిన ఫిర్యాదులపై స్పందించిన సంస్థలోని ఈవీడీఎం విభాగం చర్యలకు శ్రీకారం చుట్టింది. అమీర్‌పేటలోని పావని ప్రెస్టీజ్‌ కామ్‌ కాంప్లెక్స్‌లో వాహనం నిలిపినందుకు రూ. 30 వసూలు చేశారని రశీదును హర్ష్‌ అగర్వాల్‌ అనే వ్యక్తి సీఈసీ- ఈవీడీఎం ట్విటర్‌ ఖాతాలో పోస్ట్‌ చేశాడు. దీనిపై స్పందించిన అధికారులు ఆ సంస్థకు రూ. 50 వేల జరిమానా విధించారు. ఆబిడ్స్‌లోని అహుజా ఎస్టేట్‌లో వాహనం నిలిపినందుకు రూ. 40 తీసుకున్నారని మన్నే సురేష్‌ రశీదుతో సహా ట్విటర్‌ ద్వారా ఈవీడీఎం అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. ఆ సంస్థకు రూ. 50 వేల జరిమానా విధించారు. పార్కింగ్‌ నిబంధనలు అమలులోకి వచ్చిన అనంతరం రూ. 50వేల జరిమానా విధించడం ఇదే మొదటిసారి. సూరారం మల్లారెడ్డి నారాయణ ఆస్పత్రిలో పది నిమిషాలు కారు పార్క్‌ చేసినందుకు రూ. 30 తీసుకున్నారని మరో వ్యక్తి ఫిర్యాదు చేయగా.. ఈవీడీఎం ఈ ట్వీట్‌పై స్పందించలేదు.