పసిఫిక్ మహాసముద్రంలో పెను భూకంపం ......రిక్టర్ స్కేలుపై దీని తీవ్రత 6.7

 పసిఫిక్ మహాసముద్రంలో పెను భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై దీని తీవ్రత 6.7గా నమోదైంది. దక్షిణ అమెరికా ఆగ్నేయ దిశగా తూర్పు పసిఫిక్ మహాసముద్రం ప్రాంతాన్నిభూకంప కేంద్రంగా గుర్తించారు. సముద్ర ఉపరితలం నుంచి 10 కిలోమీటర్ల లోతున ఇది చోటు చేసుకున్నట్లు యునైటెడ్ స్టేట్స్ జియోలాజికల్ సర్వే వెల్లడించింది. భూకంప తీవ్రత అధికంగా ఉందని, దీనివల్ల సునామీ ముప్పు పొంచివుందా? లేదా? అనేది ఇంకా తెలియరాలేదు. దీని ప్రభావంతో చీలి సముద్రతీర ప్రాంతం అల్లకల్లోలంగా మారినట్లు యూఎస్‌జీఎస్ ప్రాథమికంగా నిర్ధారించింది.ఈ తెల్లవారు జామున 5:42 నిమిషాలకు నేపాల్‌లో మరో భారీ భూకంపం చోటు చేసుకుంది. రిక్టర్ స్కేలుపై దీని తీవ్రత 5.8గా నమోదైంది. నేపాల్‌లోని పొఖారా తూర్పు ప్రాంతాన్ని భూకంప కేంద్రంగా గుర్తించినట్లు యూఎస్‌జీఎస్ పేర్కొంది. లామ్‌జంగ్ జిల్లాలోని మారుమూల గ్రామం భుల్‌భులెను భూకంప కేంద్రంగా గుర్తించినట్లు నేపాల్ జాతీయ భూకంపాల పర్యవేక్షణ, పరిశోధనా కేంద్రం చీఫ్ సిస్మాలజిస్ట్ డాక్టర్ లోక్ బిజయ్ అధికారి తెలిపారు. దీనివల్ల ప్రాణ, ఆస్తి నష్టం సంభవించినట్లు ఇప్పటిదాకా సమాచారం అందలేదని చెప్పారు. పూర్తి సమాచారాన్ని సేకరిస్తున్నట్లు చెప్పారు. 5.8 తీవ్రతతో భూకంపం సంభవించడం సుదీర్ఘ విరామం తరువాత ఇదే తొలిసారిగా పేర్కొన్నారు.


హిమాలయన్ పీఠభూముల ఫలకాల్లో చోటు చేసుకున్న కదలికల వల్ల తరచూ భూప్రకంపనలు చోటు చేసుకుంటూ ఉంటాయని, ఈ సారి వాటి తీవ్రత అధికంగా ఉండటం ఆందోళన కలిగిస్తోందని బిజయ్ అధికారి వ్యాఖ్యానించారు. 2015లో నేపాల్‌లో పెనుభూకంపం సంభవించిన విషయం తెలిసిందే. నాటి ఘటనలో సుమారు తొమ్మిదివేల మంది వరకు మరణించారు. 22 వేల మంది గాయపడ్డారు. మూడున్నర లక్షల మందికి పైగా నిరాశ్రయులయ్యారు. నేపాల్‌ అత్యధిక భాగం పర్వతప్రాంతాలే కావడం వల్ల భూకంపాలు సంభవించినప్పుడు అది కలిగించే నష్టం అధికంగా ఉంటుందనేది జియోలాజికల్ సర్వే నిపుణులు అభిప్రాయం.