పెట్రోల్. డీజిల్ 90 రూపాయలను క్రాస్ చేసింది. కొన్ని చోట్ల 103 రూపాయలను దాటేసింది

 


.ప్రాణాంతక కరోనా వైరస్ సృష్టిస్తోన్న సంక్షోభ పరిస్థితుల్లోనూ ఇంధన ధరల్లో పెరుగుదల ఆగట్లేదు. పెట్రోల్, డీజిల్ రేట్లు మరోసారి పైకి ఎగిశాయి. ఈ నెల 4వ తేదీ నుంచి వాటి రేట్లు పెరగడం ఇది ఎనిమిదోసారి. తాజా పెంపు ప్రభావంతో అనేక పట్టణాల్లో వంద రూపాయల మార్క్‌ను దాటింది పెట్రోల్. డీజిల్ 90 రూపాయలను క్రాస్ చేసింది. కొన్ని చోట్ల 103 రూపాయలను దాటేసింది. డీజిల్ ధరల పెరుగుదల దాదాపు అన్ని పట్టణాలు, మెట్రో నగరాల్లో 90 రూపాయల మార్క్‌ను అధిగమించింది. డీజిల్ రేట్లు 90 రూపాయలను అధిగమించడం చరిత్రలో ఎప్పుడూ లేదు.


ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ వెల్లడించిన తాజా సవరణల ప్రకారం- పెట్రోల్ లీటర్ ఒక్కింటికి 28 నుంచి 29 పైసలు, డీజిల్ లీటర్ ఒక్కింటికి 34 నుంచి 35 పైసల మేర పెరిగింది. దీనితో దేశ రాజధానిలో పెట్రోల్ లీటర్-రూ.92.34, డీజిల్ 82.95 పైసలుగా రికార్డయింది. ముంబైలో పెట్రోల్ రేటు 98.65 రూపాయలు ఉంటోంది. డీజిల్‌ ధర 90.11 పైసలకు చేరింది. చెన్నైలో పెట్రోల్ రూ. 94.09, డీజిల్‌ ధర రూ. 87.81, కోల్‌కతలో పెట్రోల్ రూ.92.44 పైసలు, డీజిల్‌ ధర రూ.85.79 పైసలు పలుకుతోంది. బెంగళూరులో పెట్రోల్-95.41, డీజిల్-87.94, భోపాల్‌లో లీటర్ పెట్రోల్-100.38, డీజిల్-91.31, పాట్నాలో పెట్రోల్-94.56, డీజిల్ 88.18, లక్నోలో పెట్రోల్-90.18, డీజిల్-83.33, చండీగఢ్‌లో పెట్రోల్-88.82, డీజిల్-82.62గా నమోదైంది.


భోపాల్‌లో వంద రూపాయల మార్క్ దాటడం ఇదే తొలిసారి. మహారాష్ట్రలోని పర్భణీలో లీటర్ పెట్రోల్ వంద రూపాయల మార్క్‌ను దాటింది. అక్కడ రూ.100.73 పైసలు పలుకుతోంది. మధ్యప్రదేశ్‌లోని నగరాబంధ్‌లో లీటర్ పెట్రోల్ 103 రూపాయలను దాటింది. పెట్రోల్ లీటర్ ఒక్కింటికి 103.40 పైసలుగా నమోదైంది. రాజస్థాన్‌లోని శ్రీగంగానగర్‌లో లీటర్ పెట్రోల్ 103.27 పైసలకు చేరింది. ఇక్కడ డీజిల్ లీటర్ ఒక్కింటికి రూ.95.70 పైసలుగా రికార్డయింది. దేశం మొత్తం మీద ఈ రెండు ప్రాంతాల్లో పెట్రోల్ రేటు అత్యధికంగా రికార్డయింది. మధ్యప్రదేశ్‌లోని అనూప్‌పూర్‌, రీవా, ఛింద్వాడలో ఇదే పరిస్థితి కనిపించింది. అనూప్‌పూర్‌లో 102.85, రీవాలో 102.49, ఛింద్వాడలో 102.09 పైసలు పలుకుతోంది.