నీరవ్ మోదీ.. తనను భారత్‌కు అప్పగించకుండా ఉండటం కోసం విశ్వప్రయత్నాలు

 


పంజాబ్ నేషనల్ బ్యాంకును మోసం చేసి యూకేకు పారిపోయిన వజ్రాల వ్యాపారి నీరవ్ మోదీ.. తనను భారత్‌కు అప్పగించకుండా ఉండటం కోసం విశ్వప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పటికే బ్రిటన్ కోర్టులో తనను భారత్‌కు అప్పగించవద్దంటూ ఆయన పిటిషన్ వేయగా సదరు కోర్టు అతని పిటిషన్‌ను కొట్టివేసింది. దాంతో తాజాగా యూకే హైకోర్టును ఆశ్రయించారు. తన మానసిక స్థితి సరిగా లేదని, ఈ పరిస్థితుల్లో తనను భారత్‌కు అప్పగిస్తే న్యాయం జరుగదని, అందువల్ల తనను భారత్‌కు అప్పగించవద్దని హైకోర్టును కోరారు.

నీరవ్‌మోదీ పంజాబ్ నేషనల్ బ్యాంకును దాదాపు రూ.14 వేల కోట్ల మేర మోసం చేశాడు. అనంతరం యునైటెడ్ కింగ్‌డమ్‌కు పారిపోయాడు. ఈ కేసుల విచారణ జరుపుతున్న సీబీఐ అప్పటి నుంచి నీరవ్‌ను భారత్‌కు రప్పించేందుకు ప్రయత్నాలు చేస్తున్నది. ఇటీవలే యూకే హోంశాఖ నీరవ్‌ను భారత్‌కు అప్పగించేందుకు అంగీకరించింది. ఈ నేపథ్యంలో తనను భారత్‌కు అప్పగించవద్దంటూ నీరవ్ మోదీ హైకోర్టులో పిటిషన్ వేశాడు.

ప్రస్తుతం నీరవ్ మోదీ బ్రిటన్‌లోని వాండ్స్‌వర్త్ జైల్లో ఉన్నాడు. తమ దేశంలో బ్యాంకును మోసం చేసి పారిపోయాడంటూ సీబీఐ చేసిన ఫిర్యాదు మేరకు బ్రిటన్ పోలీసులు 2019లో నీరవ్ మోదీని అరెస్ట్ చేశారు. అప్పటి నుంచి బెయిల్ కోసం నీరవ్ మోదీ పలుమార్లు విజ్ఞప్తి చేసినా బ్రిటన్ కోర్టు తిరస్కరిస్తూ వచ్చింది.