వాట్సప్‌కు, కేంద్ర ప్రభుత్వానికి మధ్య వివాదం

 


 కొత్త ఐటీ నిబంధనలపై ప్రముఖ సామాజిక మాధ్యమ సంస్థ వాట్సప్‌కు, కేంద్ర ప్రభుత్వానికి మధ్య వివాదం చెలరేగింది. బుధవారం నుంచి కొత్త నిబంధనలు అమల్లోకి వచ్చిన వేళ... వీటిలో ఒక రూల్‌ను సవాలు చేస్తూ వాట్సప్‌ ఢిల్లీ హైకోర్టుకెక్కింది. భారత ప్రభుత్వ చర్య రాజ్యాంగ విరుద్ధమంటూ ఆరోపించింది. కొత్త నిబంధనల అమలుకు కసరత్తు చేస్తున్నామని తమ యాజమాన్య సంస్థ ఫేస్‌బుక్‌ చెప్పిన తర్వాత వాట్సప్‌ ఈ వాదన చేయటం విశేషం! మరోవైపు... కేంద్రం కూడా అంతే దీటుగా స్పందించింది. వాట్సప్‌ వాదన తప్పంటూ... కొత్త నిబంధనలతో ప్రజలకు, సామాజిక మాధ్యమ సంస్థలకు వచ్చిన ఇబ్బందేమీ లేదని స్పష్టంచేసింది. దేశ సార్వభౌమత్వం, శాంతిభద్రతలకు సంబంధించిన తీవ్రమైన అంశాల్లోనే ప్రభుత్వం సమాచారం కోరుతుందని తేల్చిచెప్పింది. 'ఒకవంక తమ యాజమాన్య సంస్థ ఫేస్‌బుక్‌తో తమ వినియోగదారుల సమాచారం పంచుకోవటం కోసం కొత్త గోప్యత నిబంధనలను ప్రజలపై రుద్దుతున్న వాట్సప్‌... దేశ భద్రత కోసం సమాచారం అడగటాన్ని మాత్రం తప్పుపడుతోంది. ఈ దేశంలో కార్యకలాపాలు నిర్వహించేటప్పుడు.. ఇక్కడి చట్టాలను పాటించాలి' అని స్పష్టం చేసింది. అంతేగాకుండా.. కొత్త నిబంధనల అమలుకు ఎలాంటి చర్యలు తీసుకున్నారో తక్షణమే... వీలైతే నేడే తెలియజేయండని అన్ని సామాజిక మాధ్యమ సంస్థలకు నోటీసులు జారీ చేసింది.


ఇది ప్రజల గోప్యతను హరించటమే: వాట్సప్‌


భారత ప్రభుత్వం విధించిన కొత్త ఐటీ నిబంధనలను పూర్తిగా అమలు చేయటమంటే... వినియోగదారుల గోప్యతకు భంగం కల్గించటమే అవుతుందని... అందుకు తాము సిద్ధంగా లేమని వాట్సప్‌ స్పష్టంచేసింది. ఐటీ నిబంధనల్లోని 4(2) నియమం రాజ్యాంగం కల్పించిన భావ ప్రకటన స్వేచ్ఛకు విరుద్ధమని, దీన్ని కొట్టేయాలని కోరుతూ మంగళవారం దిల్లీ హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేసింది. ఈ విషయాన్ని వాట్సప్‌ ప్రతినిధి ధ్రువీకరించారు. కొత్త నిబంధనల ప్రకారం.. దేశ సార్వభౌమత్వానికి, రక్షణకు సంబంధించిన కీలకాంశాలకు సంబంధించిన ఏదైనా సమాచారాన్ని లేదా ప్రజల భద్రతకు హాని కలిగించేలా తప్పుడు పోస్టులు పెడితే.. వాటి మూలాలను సదరు సోషల్‌మీడియా సంస్థలు ప్రభుత్వానికి వెల్లడించాల్సి ఉంటుంది. దీన్ని వాట్సప్‌ వ్యతిరేకిస్తోంది!


రాజ్యాంగ విరుద్ధం

''కేంద్రం ప్రకటించిన కొత్త నిబంధనల ప్రకారం ప్రభుత్వం ఏ సందేశం గురించి అడిగితే- దాని మూలం ఏంటో, ఎవరి నుంచి మొదట సందేశం వచ్చిందో తెలియజేయాల్సి ఉంటుంది. అంటే మేం అనుసరిస్తున్న ఎండ్‌ టు ఎండ్‌ ఎన్‌క్రిప్షన్‌ (సందేశం వివరాలు పంపేవారికి, స్వీకరించేవారికి తప్ప ఇతరులకు తెలియకపోవటం) తొలగించటమే. ఇలా చేయటం వినియోగదారుల వ్యక్తిగత గోప్యత (ప్రైవసీ)కు భంగం కల్గించటమే అవుతుంది. ఇది రాజ్యాంగ విరుద్ధం కూడా! జర్నలిస్టులు, పౌరసంఘాలు, వివిధ మతసంఘాలు, సంస్థలు, ఉద్యమకారులు, నిపుణులు, కళాకారులు... ఇలా అన్నిరకాల ప్రజలు ఎండ్‌ టు ఎండ్‌ ఎన్‌క్రిప్షన్‌ కారణంగా తమ భావస్వేచ్ఛను నిర్భయంగా వ్యక్తంజేస్తుంటారు. వాట్సప్‌లో చాట్స్‌కు సంబంధించిన ఆనుపానులు చెప్పటమంటే... మేం ఇక ప్రతి మెసేజ్‌పైనా నిఘావేసి ఉంచాలి. ఇదొకరకంగా మూకుమ్మడిగా అందరిపై నిఘా నేత్రమే! అంతేగాకుండా ఇలా చేయాలంటే రోజూ కొన్ని వందల కోట్ల సందేశాలను పర్యవేక్షిస్తూ, వాటిని అడిగినప్పుడు ఇచ్చేలా దాచిపెట్టాలి. అంటే చట్ట సంస్థలు ఎప్పుడో అడిగే సమాచారం కోసం అనవసరమైన డేటాను సేకరించి, నిక్షిప్తం చేయాల్సి వస్తుంది. ఇది ప్రజల ప్రాథమిక ప్రైవసీ హక్కుకు భంగం కల్గించే చర్య. ప్రజల వ్యక్తిగత సందేశాల గోప్యతను కాపాడటానికి వాట్సప్‌ కట్టుబడి ఉంటుంది. ప్రజల సందేశాల గోప్యతను దృష్టిలో ఉంచుకొని ఆచరణ సాధ్యమైన పరిష్కారం కోసం భారత ప్రభుత్వంతో చర్చలు కొనసాగిస్తాం. న్యాయబద్ధమైన కేసుల్లో మావద్ద ఉన్న సమాచారాన్ని పంచుకుంటూనే ఉంటాం'' అని వాట్సప్‌ ప్రకటించింది.