నిర్లక్ష్యానికి నిదర్శనం..బుక్‌ చేసిన తర్వాత రెండు గంటలకు ఆ రైలు రద్దయినట్లు సెంటర్‌ ఫర్‌ రైల్వే ఇన్‌ఫర్మేషన్‌ సిస్టం(సీఆర్‌ఐఎస్‌) నుంచి సందేశం

 


జూన్‌ 4న గుంటూరు నుంచి సికింద్రాబాద్‌ వచ్చేందుకు వెంకట్‌..ఇటీవల ప్రత్యేక రైల్లో టికెట్‌ బుక్‌ చేసుకున్నాడు. అదే రోజు మధ్యాహ్నం 2.30 గంటలకు ఆయనకు ఓ సందేశం వచ్చింది. 'మీరు ప్రయాణించాల్సిన రైలు రద్దయ్యింది. అసౌకర్యం కలిగినందుకు చింతిస్తున్నామని' అందులో ఉంది. ఇంటర్‌సిటీ(ఏపీ ఉద్యోగుల ప్రత్యేక రైలు) ప్రయాణికులకూ ఇదే అవస్థ ఎదురవుతోంది. రద్దు చేసిన రైళ్లు కూడా, ఐఆర్‌సీటీసీ వెబ్‌సైట్లో నడుస్తున్నట్లే చూపిస్తున్నారు. టిక్కెట్‌ బుక్‌ చేశాక.. రద్దు సందేశాలు వస్తుండటంతో ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు. ఇలా రద్దుచేస్తే ముఖ్యమైన పనులున్న వారి సంగతేంటని ప్రశ్నిస్తున్నారు.


నిర్లక్ష్యానికి నిదర్శనం..

ప్రస్తుతం ఏ రైలు ఎప్పుడు రద్దవుతుందో తెలియని పరిస్థితి నెలకొంది. ఆన్‌లైన్‌లో టిక్కెట్లు ఉంటున్నాయి. బుక్‌ చేసిన తర్వాత రెండు గంటలకు ఆ రైలు రద్దయినట్లు సెంటర్‌ ఫర్‌ రైల్వే ఇన్‌ఫర్మేషన్‌ సిస్టం(సీఆర్‌ఐఎస్‌) నుంచి సందేశం వస్తోంది. వాస్తవానికి ఏ రైళ్లు నడుస్తున్నాయి.. ఏవి రద్దు చేశారు తదితర వివరాలను రైల్వే అధికారులు ఎప్పటికప్పుడు ఐఆర్‌సీటీసీ వెబ్‌సైట్‌ నిర్వాహకులకు ఇవ్వాలి. కానీ.. పరిస్థితి అలా ఉండటం లేదు. ఇదే విషయమై ఐఆర్‌సీటీసీ అధికారులను సంప్రదించగా.. ప్రయాణించే రోజు 'ఇండియన్‌రైల్‌.జీఓవీ.ఐఎన్‌'లో పీఎన్‌ఆర్‌ నంబరు నమోదు చేసి వివరాలు చూసుకోవాలి. ఆ రోజు రైలు నడిస్తే ప్రయాణం ఉంటుంది.. లేదంటే డబ్బులు మొత్తం మీ ఖాతాలో జమ అవుతాయని చెబుతున్నారు.