సముద్ర గర్భంలో దాగి ఉన్న చారిత్రక ఆనవాళ్లను కనుగొని బాహ్య ప్రపంచానికి పరిచయం

 


వందేళ్ల క్రితం శ్రీకాకుళం జిల్లాలోని సముద్రంలో మునిగిపోయిన నౌకల ఆనవాళ్లను గుర్తించేందుకు జిల్లా యంత్రాంగం సిద్ధమైంది. సముద్ర గర్భంలో దాగి ఉన్న చారిత్రక ఆనవాళ్లను కనుగొని బాహ్య ప్రపంచానికి పరిచయం చేసేందుకు కార్యాచరణ చేపట్టింది. ఇప్పటికే ఓ నౌక ఆనవాళ్లను గుర్తించిన లివిన్‌ అడ్వెంచర్స్‌ బృందానికి ఈ బాధ్యత అప్పగించింది. శ్రీకాకుళం జిల్లాకు సమీపంలో మూడుచోట్ల వివిధ సందర్భాల్లో నౌకలు మునిగిపోయాయి. శ్రీకాకుళం జిల్లా సోంపేట మండలం బారువ తీరంలో వందేళ్ల క్రితం మునిగిపోయిన బ్రిటిష్‌ ఇండియా నావిగేషన్‌ కంపెనీకి చెందిన చిలకా షిప్‌ ఆనవాళ్లను విశాఖ జిల్లాకు చెందిన లివిన్‌ అడ్వెంచర్స్‌ బృందం 2020లో కనిపెట్టింది. బారువా తీరం చేరే సమయంలో షిప్‌లో అగ్ని ప్రమాదం సంభవించడంతో ఈ నౌక మునిగిపోయింది. ఈ షిప్‌ తీరానికి ఎంత దూరంలో ఉంది, దాని శిథిలాలు ఎలా ఉన్నాయనే విషయాల్ని బాహ్య ప్రపంచానికి తెలియజేశారు. ఇదే తరహాలో మరో రెండు చోట్ల నౌకలు మునిగిపోయినట్టు చరిత్ర చెబుతోంది. దీంతో శ్రీకాకుళం కలెక్టరేట్‌ వర్గాలు ఆ రెండుచోట్ల అన్వేషణ సాగించాలంటూ లివిన్‌ అడ్వెంచర్స్‌ సంస్థను సంప్రదించాయి.