యాషెస్‌ను గెలిచిన తర్వాత స్టీవ్ స్మిత్‌కు తిరిగి నాయకత్వ బాధ్యతలు

 


ఏడాది చివర్లో ఇంగ్లండ్‌తో జరగబోయే యాషెస్ సిరీస్‌ను ఆస్ట్రేలియా కైవసం చేసుకుంటే కెప్టెన్సీ బాధ్యతల నుంచి తప్పుకుంటానని ఆ జట్టు టెస్ట్ టీమ్ కెప్టెన్ టిమ్ పైన్ చెప్పాడు. యాషెస్‌ను గెలిచిన తర్వాత స్టీవ్ స్మిత్‌కు తిరిగి నాయకత్వ బాధ్యతలు అప్పగిస్తానన్నాడు. 2018 మార్చిలో దక్షిణాఫ్రికాతో జరిగిన టెస్ట్ మ్యాచ్‌లో బాల్ టాంపరింగ్‌కు పాల్పడి కెప్టెన్సీని స్మిత్ కోల్పోయాడు. ఆ తర్వాత పైన్ ఆసీస్ టెస్ట్ టీమ్ సారథిగా ఎంపికయ్యాడు. తాజగా కెప్టెన్సీ గురించి పైన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. 'ఇంగ్లండ్‌తో జరిగే యాషెస్ సిరీస్‌ను మేం 5-0తో గెలుచుకున్నాక కెప్టెన్సీ బాధ్యతలను వదిలేస్తే ఎంత బాగుంటుంది. కానీ, అదెంతో కష్టమైన సిరీస్ అని తెలుసు. గెలుపు కోసం మేం చెమటోడ్చాల్సి రావొచ్చు. చివరి టెస్ట్ చివరి రోజు మేం 300 పరుగులు ఛేదించాల్సి రావచ్చు. అప్పడు నేను సెంచరీ చేసి విన్నింగ్ షాట్ కొట్టాక కెప్టెన్సీని వదలేస్తాన'ని పైన్ చెప్పాడు. అలాగే స్మిత్ సారథ్యం గురించి కూడా మాట్లాడాడు. నైపుణ్య పరంగానూ, సారథిగానూ స్మిత్ ఉత్తముడని, చాలా చిన్న వయసులో జాతీయ జట్టుకు నాయకత్వం వహించాడని పేర్కొన్నాడు.