తమిళనాడు రాజకీయాలు ఎప్పుడూ హాట్ టాపిక్కే

 


 తమిళనాడు రాజకీయాలు ఎప్పుడూ హాట్ టాపిక్కే అవుతాయి. ఎప్పుడూ ఏవో ఒక రాజకీయ ప్రకంపనలు వస్తూనే ఉంటాయి. తాజా అసెంబ్లీ ఎన్నికల్లో సంపూర్ణ మెజార్టీ సాధించి... DMK అధికార పగ్గాలు చేపట్టడంతో... ఇక యాక్టివ్ రాజకీయాలు లేనట్లే అనుకున్నారు అంతా. కానీ... కమల్ హాసన్ రూపంలో మళ్లీ కాస్తంత కలకలం రేగుతోంది. తాజా ఎన్నికల్లో ఆయన పార్టీ... మక్కల్ నీది మయ్యం (MNM)... ఒక్క సీటు కూడా గెలుచుకోలేకపోయింది. స్వయంగా కమల్ హాసనే పోటీ చేసి కూడా ఓడిపోయారు. దాంతో... కమల్ హాసన్... MNM కంటే... ఏపీలో జనసేనే బెటర్ అనే కంపేరిజన్లు బాగా పుట్టుకొచ్చాయి. ఇదే సమయంలో... ఓటమి తర్వాత... MNM నుంచి ఇతర పార్టీల్లోకి నేతలు జంప్ అవుతున్నారు. కమల్ హాసన్ రాజకీయాలకు గుడ్‌బై చెబుతారు కాబట్టే... నేతలు వేరే దారి చూసుకుంటున్నారనే ప్రచారం జరుగుతోంది.


66 ఏళ్ల కమల్ హాసన్... మార్పు తెస్తానని రాజకీయాల్లోకి వచ్చారు. ఐతే... ఆయనలాగే దేవుడు శాసించాడంటూ... రాజకీయాల్లోకి వచ్చిన సూపర్ స్టార్ రజనీకాంత్... ఎన్నికలకు టైమ్ దగ్గర పడుతున్నప్పుడు అనారోగ్యం పాలై... పూర్తిగా రాజకీయాలకు గుడ్‌బై చెప్పారు. కమల్ హాసన్ మాత్రం తానేంటో చూపిస్తానని రంగంలోకి దిగి చతికిలపడ్డారు. గత పదేళ్లుగా కమల్ హాసన్‌కి వెండి తెరపై వెలుగులు లేవు. పార్టీ పెట్టి దూసుకెళ్లడానికి ఆయన యువనేత కాదు. అందువల్ల ఆయనతో నడిచేవారు కరవయ్యారు. దానికి తోడు... తమిళనాడులో మొదటి నుంచి DMK, అన్నాడీఎంకేల మధ్య అధికారం చేతులు మారుతోంది. అదే సమయంలో DMK పదేళ్లుగా అధికారానికి దూరంగా ఉండటం, ఆ పార్టీ నుంచి యువ నేతగా... MK స్టాలిన్ రణ రంగంలోకి దిగడం వంటివి ఆ పార్టీకి కలిసొచ్చాయి. దాంతో ప్రజలు కమల్ హాసన్ వైపు అస్సలు చూడలేదు.


ఈ పరిణామాలన్నీ లెక్కలోకి తీసుకున్న కమల్ హాసన్... ఫలితాలు చూసి తీవ్ర నిరాశ చెందినట్లు తెలుస్తోంది. ఆయన పార్టీ కార్యకర్తలు కూడా ఫలితాల తర్వాత కనిపించట్లేదు. చాలా మంది నేతల లాగే... పార్టీ ఉపాధ్యక్షుడు మహేంద్రన్‌ కూడా పార్టీకి గుడ్‌బై చెప్పడంతో... ఇంకా నీరుగారిపోయింది. ఇక ఇప్పట్లో ఎన్నికలు లేవు. DMKపై విమర్శలు చేయడానికైనా కనీసం సంవత్సరం పడుతుంది. ఇక ఎప్పటికి అధికారం దక్కుతుందో తెలియదు. అందువల్ల కమల్ హాసన్ కూడా గుడ్‌బై చెబుతారనే ప్రచారం జరుగుతోంది. దీనిపై అధికారికంగా మాత్రం ఎలాంటి ప్రకటనా రాలేదు.