కేరళలో ఎల్డీఎఫ్ (లెఫ్ట్ డెమోక్రటిక్ ఫ్రంట్) చరిత్ర

 


 కేరళలో ఎల్డీఎఫ్ (లెఫ్ట్ డెమోక్రటిక్ ఫ్రంట్) చరిత్ర సృష్టించింది. అధికారాన్ని నిలుపుకొని తమకు తిరుగులేదని నిరూపించింది. కేరళలో నాలుగు దశాబ్దాల తర్వాత ఒక పార్టీ వరుసగా రెండోసారి అధికారంలోకి రావడం ఇదే మొదటిసారి. ఈ నేపథ్యంలో సీఎం పిన్నరయి విజయన్ మీడియాతో మాట్లాడుతూ..ఎల్డీఎప్ కూటమికి అనుకూలంగా ప్రజలు సృష్టమైన తీర్పునిచ్చారు. కేరళ ప్రజలకు ఈ విజయం అంకితం. కరోనావైరస్ విజృంభిస్తున్న నేపథ్యంలో విజయోత్సవ సంబురాలకు ఇది సమయం కాదు. ఇది కోవిడ్ కు వ్యతిరేకంగా పోరాడాల్సిన సమయం. కేరళలో ఈరోజు 31,950కొత్త కరోనా కేసులు నమోదయ్యాయని సీఎం తెలిపారు. కాగా, సీఎం పినరయి విజయన్ ధర్మదాం నియోజకవర్గం నుంచి గెలుపొందారు.


కేరళలో మొత్తం 140 స్థానాలుండగా..మ్యాజిక్ ఫిగర్ 71గా ఉంది. ఇప్పటివరకు విడుదలైన అధికారిక ఫలితాల ప్రకారం 8 స్థానాల్లో విజయం సాధించిన అధికార ఎల్డీఎఫ్ కూటమి మరో 85స్థానాల్లో ఆధిక్యంలో ఉండగా..కాంగ్రెస్ నేతృత్వంలోని యూడీఎఫ్ కూటమి 2 స్థానాల్లో విజయం సాధించి.. 41స్థానాల్లో మాత్రమే ఆధిక్యంలో ఉంది. ఇక,బీజేపీ పెద్ద ఎత్తున ప్రచారం చేసినా.. ఆశించిన ఫలితాలు మాత్రం రాలేదు. కనీసం ఒక్క సీటు కూడా గెలువలేదు. పాలక్కడ్ నియోజకవర్గం నుంచి బీజేపీ సీఎం అభ్యర్థి మెట్రోమ్యాన్ శ్రీధర్ ప్రారంభంలో లీడింగ్‌లో ఉన్నప్పటికీ చివరకు ఓడిపోయారు. ఆయనపై కాంగ్రెస్ నేత షఫి పరంబిల్ 3,840 ఓట్ల మోజారిటీతో గెలుపొందారు. ఇక బీజేపీ తరపున త్రిస్సూరు నుంచి పోటీచేసిన సినీ నటుడు సురేష్ గోపి కూడా పరాజయం పాలయ్యారు. అంతేకాదు కేరళ బీజేపీ అధ్యక్షుడు సురేంద్రన్ కూడా మంజేశ్వర్‌లో ఓడిపోయారు.


కేరళలో గెలుపుతో సీఎం విజయన్ రికార్డు సృష్టించారు. కేరళలో గత 40 ఏళ్లుగా ఎన్నికలు జరిగిన ప్రతిసారీ అధికార మారుతుంది. ఒకసారి ఎల్డీఎఫ్ గెలిస్తే.. మరోసారి కాంగ్రెస్ నేతృత్వంలోని యూడీఎఫ్ విజయం సాధిస్తుంది. కానీ ఈ ఎన్నికల్లో ఎల్డీఎఫ్ మరోసారి గెలిచి అధికారాన్ని నిలుపుకుంది. కరోనాపై పిన్నరయి విజయన్ నేతృతంలోని ఎల్డీఎఫ్ ప్రభుత్వం అద్భుతంగా పనిచేసిందన్న పేరుంది. కోవిడ్‌పై చేసిన పోరాటమే ఎన్నికల్లో కలిసి వచ్చిందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కరోనా సంక్షోభ సమయంలో సీఎం పినరయి విజయన్ చక్కగా పనిచేసి..కేంద్రప్రభుత్వం నుంచి ప్రశంసలందుకోవడమే కాకుండా..అంతర్జాతీయంగా కూడా కేరళ ప్రభుత్వ పనితీరుపై ప్రశంసలు వెల్లువెత్తాయి. డబ్యూహెచ్ వో సైతం కేరళ ప్రభుత్వాన్ని అభినందించిన విషయం తెలిసిందే.