ఢిల్లీ హైకోర్టు జారీ చేసిన కోర్టు ధిక్కార చర్యలపై సుప్రీం బుధవారం స్టే

 


ఢిల్లీ హైకోర్టు జారీ చేసిన కోర్టు ధిక్కార చర్యలపై సుప్రీం బుధవారం స్టే ఇచ్చింది. ఢిల్లీకి ఆక్సిజన్‌ సరఫరాకై చర్యలు తీసుకోవడంలో విఫలమైనందుకు కేంద్ర ప్రభుత్వ అధికారులపై కోర్టు ధిక్కరణ చర్యలకై ఢిల్లీ హైకోర్టు ఆదేశించింది. సంబంధిత అధికారులపై చర్యలు తీసుకోవడం వల్ల ఢిల్లీకి ఆక్సిజన్‌ అందదని జస్టిస్‌ డి.వై.చంద్రచూడ్‌ నేతృత్వంలోని బెంచ్‌ వ్యాఖ్యానించింది. ఎవరైనా ఉద్దేశపూర్వకంగానే పనిచేయలేదని తేలితే ధిక్కార చర్యలు తీసుకోవాలని పేర్కొంది. మహారాష్ట్రలో యాక్టివ్‌ కేసులు 92వేల వరకు వున్నా ఆక్సిజన్‌ సరఫరాను ఎలా నిర్వహిస్తున్నారో బృహన్‌ ముంబయి కార్పొరేషన్‌ చీఫ్‌లను సంప్రదించాలని బెంచ్‌, ఢిల్లీ చీఫ్‌సెక్రటరీ, ఆరోగ్య శాఖ కార్యదర్శి, కేంద్ర ఆరోగ్య శాఖ కార్యదర్శిలకు సూచించింది. గురువారం ఉదయం 10.30కల్లా ఇందుకు సంబంధించి సమగ్ర ప్రణాళికా పట్టికను అందజేయాల్సిందిగా కోర్టు కేంద్రాన్ని ఆదేశించింది. జాతీయ రాజధాని ప్రాంతానికి ఆక్సిజన్‌ సరఫరా వివరాలు, రాజధానికి గల రవాణా సదుపాయాలు, ఆక్సిజన్‌ పంపిణీ పాయింట్లతో సహా ఇతర మౌలిక ఏర్పాట్లు వంటి వివరాలను అందులో ఇవ్వాలని పేర్కొంది. ఢిల్లీకి రోజుకు 700మెట్రిక్‌ టన్నుల ఆక్సిజన్‌ అవసరాలను తీర్చేలా చర్యలతో కూడిన ప్రణాళిక అందించాలని కోరింది. ఏప్రిల్‌ 30న జారీ చేసిన ఆదేశాలకు అనుగుణంగా చర్యలు తీసుకోవాలని సొలిసిటర్‌ జనరల్‌ తుషార్‌ మెహతాని కోరింది.