యాస్ తుపాను ముంచుకొస్తున్న నేపథ్యంలో భారత వాయసేన రెడీ

 


యాస్ తుపాను ముంచుకొస్తున్న నేపథ్యంలో భారత వాయసేన రెడీ అయింది. అత్యవసర వినియోగం కోసం 11 రవాణా విమానాలు, 25 హెలికాప్టర్లను సిద్ధం చేసింది. ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కొనే ఉద్దేశంతో ముందుగానే అప్రమత్తమైంది. 21 టన్నుల సహాయ సామగ్రి, 334 మంది ఎన్డీఆర్ఎఫ్ సిబ్బందిని కోల్‌కతా, పోర్ట్‌బ్లెయిర్‌కు తరలించింది. సహాయ సామగ్రి, అవసరమైన పరికరాలు, సిబ్బందిని పాట్నా, వారణాసి, అరక్కోణం నుంచి ఐదు సి-130 విమానాల ద్వారా తరలించినట్టు అధికారులు తెలిపారు.

అతి తీవ్ర తుపానుగా మారే అవకాశం ఉన్న 'యాస్' ఈ నెల 26న తూర్పు తీరాన్ని తాకే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ ఇప్పటికే హెచ్చరికలు జారీ చేసింది. 950 మంది ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది, 70 టన్నుల సామగ్రిని జామ్‌నగర్, వారణాసి, పాట్నా, అరక్కోణం నుంచి కోల్‌కతా, భువనేశ్వర్, పోర్టుబ్లెయిర్‌లకు 15 రవాణా విమానాల ద్వారా తరలించినట్టు అధికారులు తెలిపారు. అలాగే, 16 రవాణా విమానాలు, 26 హెలికాప్టర్లు తక్షణ మోహరింపు కోసం సిద్ధంగా ఉన్నట్టు పేర్కొన్నారు.


భారత నేవీ కూడా సహాయ చర్యలకు సిద్ధమైంది. భువనేశ్వర్, కోల్‌కతాలకు 10 హ్యుమానిటేరియన్ అసిస్టెట్స్ అండ్ డిజాస్టర్ రిలీఫ్ (హెచ్ఏడీఆర్) ప్యాలెట్లను పంపింది. పోర్టుబ్లెయిర్‌లో ఇప్పటికే 5 హెచ్ఏడీఆర్ ప్యాలెట్లు సిద్ధంగా ఉన్నట్టు తెలిపింది.