వరుసగా పెరుగుతున్న పెట్రోల్, డీజిల్ ధరలు

 


ఐదు రాష్ట్రాలు-కేంద్రపాలిత ప్రాంతాల్లో ఎన్నికల అనంతరం పెట్రోల్, డీజిల్ ధరలు వరుసగా పెరుగుతున్నాయి. మంగళవారం నుండి పెరుగుతున్న ధరలు నేడు (శుక్రవారం మే 7) కూడా స్వల్పంగా పెరిగాయి. లీటర్ పెట్రోల్ పైన 28 పైసలు, డీజిల్ పైన 31 పైసలు పెరిగింది. అంతర్జాతీయ ధరలకు అనుగుణంగా దేశీయ చమురురంగ కంపెనీలు ప్రతిరోజు ఉదయం 6 గంటలకు ధరల్ని సవరిస్తాయి. తాజా సవరణ ప్రకారం దేశ రాజధాని న్యూఢిల్లీలో లీటర్ పెట్రోల్ 28 పైసలు పెరిగి రూ.91.27, లీటర్ డీజిల్ 31 పైసలు పెరిగి రూ.81.73 వద్ద ట్రేడ్ అయింది.


ముంబైలో లీటర్ పెట్రోల్ రూ.97.61, లీటర్ డీజిల్ రూ.88.82, చెన్నైలో లీటర్ పెట్రోల్ రూ.93.15, లీటర్ డీజిల్ రూ.86.65, కోల్‌కతాలో లీటర్ పెట్రోల్ రూ.91.41, లీటర్ డీజిల్ రూ.84.57గా ఉంది. హైదరాబాద్‌లో లీటర్ పెట్రోల్ రూ.94.68, లీటర్ డీజిల్ రూ.89.11గాఉంది. ఈ నాలుగు రోజుల్లో పెట్రోల్ లీటర్‌కు 87 పైసలు, డీజిల్ రూ.1 పెరిగింది.

ఢిల్లీలో లీటర్ పెట్రోల్ పైన కేంద్ర పన్నులు రూ.32.98 కాగా, రాష్ట్ర ప్రభుత్వ సేల్స్ ట్యాక్స్ లేదా వ్యాట్ రూ.19.55గా ఉంది. డీజిల్ విషయానికి వస్తే లీటర్ పైన ఎక్సైంజ్ డ్యూటీ రూ.31.83 కాగా, రాష్ట్ర ప్రభుత్వం వ్యాట్ రూ.10.99గా ఉంది. వీటతో పాటు డీలర్ కమిషన్ పెట్రోల్ పైన రూ.2.6, డీజిల్ పైన రూ.2గా ఉంది.