ఈటల రాజేందర్ చుట్టూ ఉచ్చు

 


ఈటల రాజేందర్ చుట్టూ ఉచ్చు బిగుసుకుంటోంది. ఈటల ప్రెస్ మీట్ జరుగుతుండగానే మరో భూ వివాదం తెరపైకి వచ్చింది. దేవరయాంజల్ సీతారామా స్వామి భూములను ఈటల ఆక్రమించారంటూ ఆరోపణలు వెల్లువెత్తాయి. ఆ భూముల ఆక్రమణలపై నలుగురు ఐఏఎస్ లతో విచారణ కమిటీ ఏర్పాటు చేసినట్టు తెలుస్తోంది. వీలైనంత త్వరగా నివేదిక ఇవ్వాలని సీఎస్ సోమేశ్ కుమార్ ఆదేశాలు జారీచేశారు.


దేవరయాంజల్ లో మొత్తం 1521 ఎకరాల ఆలయ భూములు ఉన్నాయి. ఈటలతో పాటు ఆయన అనుచరులు దేవాలయ భూములు ఆక్రమించారని ప్రభుత్వానికి ఫిర్యాదులు అందాయి. రూ. వెయ్యి కోట్లకు పైగా దేవాలయ భూములను ఆక్రమించినట్టు ప్రభుత్వం గుర్తించింది. దేవాలయ భూముల్లో అనుమతులు లేకుండా నిర్మాణాలు చేపట్టినట్టు గుర్తించారు. దేవాలయ భూముల ఆక్రమణల ద్వారా భక్తుల మనోభావాలు గాయపర్చినట్టు ఈటలపై అభియోగాలు వచ్చాయి.


వాస్తవాలు నిగ్గు తేల్చేందుకు కమిటీని ప్రభుత్వం ఏర్పాటు చేసింది. పంచాయతీ రాజ్ కమిషనర్ రఘునందన్ రావు ఆధ్వర్యంలో కమిటీని ఏర్పాటు చేశారు. రాజీనామాకు ఈటల సిద్ధమైనట్టు సమాచారం. నేడో, రేపో పార్టీకి ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయనున్నట్టు తెలుస్తోంది. తెలంగాణ మంత్రులు, ఎమ్మెల్యేలు ఎవరూ సంతృప్తిగా లేరని విమర్శలు వినిపిస్తున్నాయి.