తుపాను ప్రభావిత ఒడిశా, పశ్చిమ బెంగాల్లో శుక్రవారం ప్రధాని నరేంద్ర మోదీ పర్యటన

 


తుపాను ప్రభావిత ఒడిశా, పశ్చిమ బెంగాల్లో శుక్రవారం ప్రధాని నరేంద్ర మోదీ పర్యటించనున్నారు. ఆయా రాష్ట్రాల్లో జరిగే సమీక్ష సమావేశాలకు అధ్యక్షత వహించనున్నారు. జరిగిన నష్టం, చేపడుతున్న సహాయ చర్యలను అడిగి తెలుసుకోనున్నారు. హెలికాప్టర్‌ ద్వారా విహంగ వీక్షణం జరిపి, నష్టాన్ని అంచనా వేయనున్నారు. గురువారం ఆయన దిల్లీలోనూ సంబంధిత అధికారులతో సమీక్ష జరిపారు. వీలయినంత తొందరగా సాధారణ పరిస్థితులు నెలకొనేటట్టు చర్యలు తీసుకోవాలని కేంద్ర, రాష్ట్ర సంస్థలను ఆదేశించారు. కోల్‌కతాలో ముఖ్యమంత్రి మమతా బెనర్జీ మాట్లాడుతూ.. విహంగ వీక్షణం అనంతరం ప్రధాని మోదీ పశ్చిమ మేదినీపుర్‌ జిల్లా కలైకుండా వైమానిక స్థావరంలోనే సమీక్ష సమావేశం నిర్వహిస్తారని చెప్పారు. వర్షం తగ్గక జనం ఆకలి కేకలు

పశ్చిమ బెంగాల్‌లోని చాలా ప్రాంతాల్లో గురువారం భారీ వర్షాలు కురవడంతో జనం ఆకలితో అలమటించాల్సి వచ్చింది. ప్రతికూల పరిస్థితుల కారణంగా సహాయబృందాలు వెళ్లడానికి వీలు లేకపోవడంతో కొన్ని చోట్ల ఆహారం అందని పరిస్థితి ఎదురయింది. ప్రధానంగా సుందరబన్స్‌ ప్రాంతంలోని గ్రామాల్లో ఈ దృశ్యాలు కనిపించాయి.

రూ.15వేల కోట్ల నష్టం : మమత

తుపాను కారణంగా పశ్చిమ బెంగాల్‌లో కనీసం రూ.15వేల కోట్ల మేర నష్టం జరిగి ఉంటుందని ముఖ్యమంత్రి మమతా బెనర్జీ చెప్పారు. వర్షాలు తగ్గిన తరువాత నష్టాలను పూర్తిగా అంచనా వేస్తామని తెలిపారు. బాధితులకు నష్టపరిహారం అందించేందుకు జూన్‌ మూడో తేదీ నుంచి 'దువారే త్రాణ్‌' (ద్వారం వద్దకే సహాయం) పథకాన్ని ప్రారంభిస్తామని చెప్పారు. ఆ రోజు నుంచి జూన్‌ 18 వరకు అధికారులు బాధితుల నుంచి దరఖాస్తులు స్వీకరిస్తారని, 18 నుంచి 30 వరకు వాటిని తనిఖీ చేస్తారని తెలిపారు. జులై ఒకటి నుంచి 8వ తేదీలోగా అందరికీ పరిహారం అందిస్తామని చెప్పారు. లబ్ధిదారుల బ్యాంకు ఖాతాల్లోనే నగదు జమ చేస్తామని తెలిపారు.