ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఫలితాల్లో ఎదురుదెబ్బలు తిన్న బిజెపి

 


ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఫలితాల్లో ఎదురుదెబ్బలు తిన్న బిజెపికి ఉత్తర ప్రదేశ్‌ పంచాయతీ ఎన్నికల్లో ప్రజలు సరైన గుణపాఠం చెప్పారు. ప్రధాని ప్రాతినిధ్యం వహిస్తున్న వారణాసి తోపాటు అయోధ్య, మథురల్లో ఆ పార్టీ పరాజ యం పాలవడం ఆ పార్టీపై ప్రజల్లో ఉన్న ఆగ్రహాన్ని తెలియజేస్తోంది. ఈ ప్రాంతాల్లో బిజెపి కన్నా సమాజ్‌వాదీ పార్టీ, బహుజన్‌ సమాజ్‌ పార్టీలు ఎక్కువ స్థానాలు గెలుచుకోవడం విశేషం. దీంతో, బిజెపి హిందూత్వ ప్రచారాన్ని ఓటర్లు పట్టించుకోవడం లేదని స్పష్టమవుతోంది. వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న ఉత్తరప్రదేశ్‌ లో బిజెపికి తాజా ఫలితాలు గట్టి సంకేతాలే పంపించాయి. రామమందిరం పేరుతో దేశవ్యాప్తం గా ప్రచారం చేస్తున్న బిజెపికి అయోధ్యలోనే గట్టి షాక్‌ తగిలింది. అయోధ్యలో 40 జిల్లా పంచాయతీ వార్డులు ఉండగా, బిజెపికి ఆరు స్థానాలే లభించాయి. ఎస్‌పి 24 స్థానాలు గెలుచుకోగా, బిఎస్‌పి ఐదు స్థానాల్లో విజయం సాధించింది. మిగిలిన స్థానాలను చిన్న పార్టీలు, స్వతంత్య్ర అభ్యర్థులు గెలుచుకోవడం గమనార్హం. ప్రధాని మోడీ ప్రాతినిధ్యం వహిస్తున్న వారణాసి (కాశీ)లో మొత్తం 40 వార్డుల్లో బిజెపికి ఏడు స్థానాల్లోనే విజయం లభించింది.


ఎస్‌పికి 15 స్థానాలు లభించగా, బిఎస్‌పి 5 స్థానాలు లభించాయి. మథురలోనూ కమలం పార్టీకి ఇదే పరిస్థితి. ఇక్కడ మొత్తం 33 వార్డుల్లో బిజెపికి తొమ్మిది స్థానాలే దక్కాయి. బిఎస్‌పి 11 వార్డులు, ఎస్‌పి ఒక్క వార్డులో విజయం సాధించాయి.


మధుర జిల్లాలో బిఎస్‌పి మొత్తంగా 381 జిల్లా పంచాయతీ స్థానాలను దక్కించుకుంది. కాంగ్రెస్‌ 76 స్థానాలను గెలుచుకుంది. మిగిలిన స్థానాలను రాష్ట్రీయ లోక్‌దళ్‌, ఇతర చిన్న పార్టీలు, స్వతంత్య్ర అభ్యర్థులు గెలుచుకున్నారు. యుపిలోని తూర్పు, మధ్య ప్రాంతంలో ఎస్‌పి స్పష్టమైన ఆధిక్యాన్ని కనబర్చింది. 'రానున్న ఉత్తరప్రదేశ్‌ అసెంబ్లీ ఫలి తాల్లోనూ ఎస్‌పి ఇదే ప్రభంజనాన్ని సృష్టిస్తుంది' అని ఆ పార్టీ నేత రాజేంద్ర చౌదరి తెలిపారు.