ఆంధ్రప్రదేశ్ లో పదో తరగతి పరీక్షలు గతంలో ప్రకటించిన షెడ్యూల్ ప్రకారమే

 


 ఆంధ్రప్రదేశ్ లో పదో తరగతి పరీక్షలు గతంలో ప్రకటించిన షెడ్యూల్ ప్రకారమే జరుగుతాయని.. షెడ్యూల్ లో ఎలాంటి మార్పు లేదని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ చెప్పారు. షెడ్యూల్ ప్రకారం జూన్ 7 నుంచి పదో తరగతి పరీక్షల నిర్వహణకు ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని స్పష్టం చేశారు. శనివారం(మే 15,2021)0 ఆయన మీడియాతో మాట్లాడారు.


టెన్త్ పరీక్షల నిర్వహణకు ఏర్పాట్లు యధావిధిగా జరుగుతున్నాయని మంత్రి తెలిపారు. పరీక్షలు మళ్లీ వాయిదా పడతాయంటూ కొంతమంది అడుగుతూ.. ప్రచారం చేస్తున్న విషయాన్ని ఆయన ప్రస్తావిస్తూ.. పరీక్షల షెడ్యూల్ లో ఇప్పటివరకు ఎలాంటి మార్పులు చేయలేదన్నారు. నెలాఖరులో.. లేదా వచ్చే నెల మొదటి వారంలోపు సీఎం జగన్ మరోసారి ఉన్నత స్థాయి సమీక్ష చేస్తారని చెప్పారు.


కరోనా కట్టడికి సీఎం జగన్ చర్యలు మంచి ఫలితాలను ఇస్తున్నాయని చెప్పారు. ఆరోగ్యంతో పాటు విద్యార్థులకు మంచి భవిష్యత్‌ అందించాలన్నదే తమ ఉద్దేశమని మంత్రి అన్నారు. ఈ నెలాఖరు వరకు విద్యార్థులకు సెలవులు ఇచ్చామన్న మంత్రి.. వారి భవిష్యత్తు కోసమే పరీక్షలు నిర్వహిస్తున్నామన్నారు. పలు రాష్ట్రాలు ఇప్పుటికే పరీక్షలు నిర్వహించాయని గుర్తు చేశారు. జూన్ 1 నుంచి టీచర్లు విధులకు హాజరు కావాల్సిందిగా ఆదేశించామని మంత్రి తెలిపారు. రాబోయే రోజుల్లో కరోనాను బట్టి నిర్ణయం తీసుకుంటామని.. అవసరమైన ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటామని మంత్రి వివరించారు. విద్యార్థులు మాత్రం షెడ్యూల్ ప్రకారమే పరీక్షలకు సన్నద్ధం కావాలని మంత్రి సూచించారు.


కరోనా మహమ్మారి కారణంగా దాదాపు అన్ని పరీక్షలు రద్దు అయ్యాయి. కొన్ని పరీక్షలు వాయిదా పడ్డాయి. ఈ విద్యా సంవత్సరం అంతా గందరగోళంగా సాగుతోంది. ఈ నేపథ్యంలో పరీక్షల నిర్వహణ కూడా అస్తవ్యస్తంగానే ఉంది. ప్రస్తుత పరిస్థితుల్లో ఏపీలో టెన్త్ పరీక్షలు రద్దు చేయాలనే డిమాండ్లు వినిపిస్తున్నాయి. ప్రభుత్వం మాత్రం పరీక్షల నిర్వహణకే మొగ్గు చూపుతోంది.