ఎయిర్ ఇండియాకు చెందిన సిటా పీఎస్‌ఎస్‌ ప్యాసింజర్‌ సర్వీస్‌ సిస్టమ్‌పై సైబర్ దాడులు

 


సైబర్ నేరగాళ్లు మరో సారి రెచ్చిపోయారు. ప్రముఖ దేశీయ విమనాయాన సంస్థ అయిన ఎయిర్ ఇండియాకు చెందిన సిటా పీఎస్‌ఎస్‌ ప్యాసింజర్‌ సర్వీస్‌ సిస్టమ్‌పై సైబర్ దాడులు నిర్వహించారు. సంస్థ యొక్క దాదాపు 45 లక్షల మంది విమాన ప్రయాణికుల సమాచారాన్ని వారు హ్యాక్ చేశారు. డేడా చోరీకి గురైన వారిలో దేశీయ, అంతర్జాతీయ ప్రయాణికులు ఉన్నారు. ఆ లీకైన సమాచారంలో ప్రయాణికులకు సంబంధించిన పాస్‌పోర్ట్‌ వివరాలు, అడ్రస్‌, టికెట్‌ కు చెందిన సమాచారం, క్రెడిట్‌ కార్డ్‌ వివరాలు ఉన్నట్లు ప్రయాణికులకు పంపిన ఓ లెటర్ లో ఎయిర్ ఇండియా తెలిపింది. ఫిబ్రవరి 25న ప్రయాణికులకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ ను సైబర్‌ నేరగాళ్లు దొంగిలించినట్టు గుర్తించామన్నారు. కానీ దానికి సంబంధించిన వివరాలు మార్చి 25, ఏప్రిల్‌ 5 తర్వాతనే తెలిసినట్లు సంస్థ వివరించింది.  ఎస్‌ఐటీఏ పీఎస్‌ఎస్‌ ప్యాసింజర్‌ సర్వీస్‌ సిస్టమ్‌ (సర్వర్‌) పై దాడి జరిగిందని తెలియగానే నిపుణుల సాయంతో ప్రత్యేక చర్యలు చేపట్టినట్లు ఎయిర్ ఇండియా తెలిపింది. సర్వర్‌ కు సంబంధించిన పాస్‌వర్డ్‌లను వెంటనే మార్చినట్లు ఎయిర్ ఇండియా తెలిపింది. అయితే ప్రయాణికులకు కూడా ఎయిర్ ఇండియా కీలక సూచనలు చేసింది. లాగిన్‌ వివరాలు, పేమెంట్‌ కార్డుల పాస్‌వర్డులను మార్చుకోవాలని సూచనలు చేసింది.  ఇదిలా ఉంటే.. సైబర్‌ దాడికి ఎవరు పాల్పడ్డారన్న విషయాన్ని ఎయిర్ ఇండియా ఇంత వరకు చెప్పలేదు. 2011 ఆగస్టు నుంచి 2021 ఫిబ్రవరి 20 మధ్య రిజిస్టర్‌ అయినవారు, టికెట్‌ బుక్‌ చేసుకున్నవారి సమాచారం మాత్రమే లీక్ అయినట్లు తెలుస్తోంది. ప్రయాణిల పేర్లు, డేట్ ఆఫ్ బర్త్, కాంటాక్ట్ వివరాలు, చిరునామా, పాస్‌పోర్ట్‌ వివరాలు, టికెట్‌ సమాచారం, క్రెడిట్ కార్డుకు సంబంధించిన వివరాలు లీక్ అయ్యాయి.  ఇదిలా ఉంటే.. ఈ కరోనా కాలంలో దేశ వ్యాప్తంగా సైబర్ నేరాలు పెరిగి పోయాయి. ఓ ప్రముఖ చానల్ లో పనిచేస్తున్న యువతికి మాయ మాటలు చెప్పడంతో మోసపోయి నగదు పోగొట్టుకుంది. ఇలా రోజుకు నగరంలో పోలీస్ స్టేషన్లలో ఏడు నుంచి ఎనిమిది ఫిర్యాదులు వస్తున్నట్లు సైబరాబాద్ పోలీసులు తెలిపారు. సైబర్‌ నేరగాళ్లు మొబైల్‌ అప్లికేషన్స్‌లో పెట్టుబడి పెడితే తక్కువ సమయంలోనే అధిక లాభాలు వస్తాయంటూ నమ్మించి పలువురి నుంచి రూ. 14 లక్షలు కొల్లగొట్టారు. వేర్వేరు ప్రాంతాల్లో జరిగిన సంఘటనల్లో పోలీసులకు ఫిర్యాదులు అందాయి.  పూర్తి వివరాల్లోకి వెళ్తే.. హైదరాబాద్ లో ఓ చానెల్‌లో పనిచేస్తున్న యువతికి గుర్తుతెలియని నంబర్‌ నుంచి ఓ వాట్సాప్‌ లింక్‌ వచ్చింది. మొదట దానిని పట్టించుకోలేదు. ఆ తర్వాత ఓ వ్యక్తి ఫోన్‌ చేసి ఆ లింక్‌ గురించి చెప్పాడు. ప్రస్తుతం కరోనా వేళ ఉద్యోగాలు లేక చాలా మంది ఇబ్బందులకు గురవుతున్నారని.. తక్కువ సమయంలో ఎక్కువ సంపాదించే అవకాశం ఉంటుందని నమ్మ బలికి.. మార్కెట్లో మొబైల్‌ యాప్స్‌కు విపరీతమైన డిమాండ్‌ ఉందని, వాటిలో పెట్టుబడులు పెడితే అధిక లాభాలుంటాయని నమ్మించాడు. మీరు పెట్టిన డబ్బులకు రిటర్న్ ఏరోజుకారోజు ఉంటుందని చెప్పడంతో ఆ యువతి మోసపోయింది. ఇలాంటి నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలని పోలీసులు సూచిస్తున్నారు..