ఎపి అసెంబ్లీ బడ్జెట్‌ సమావేశం

 


ఎపి అసెంబ్లీ బడ్జెట్‌ సమావేశం గురువారం ప్రారంభమైంది. కోవిడ్‌ నేపథ్యంలో.. రాజభవన్‌ నుంచే గవర్నర్‌ బిశ్వభూషణ్‌ హరిచందన్‌ వర్చువల్‌గా ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగించారు. కాసేపట్లో సభావ్యవహారాల కమిటీ సమావేశాన్ని నిర్వహించనున్నారు. అనంతరం గవర్నర్‌ ప్రసంగంపై ధన్యవాద తీర్మానంపై సభలో చర్చించనున్నారు. ఈరోజు ఉదయం 11 గంటల తర్వాత ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి రూ.2.30 లక్షల కోట్లతో 2021-22 రాష్ట్ర బడ్జెట్‌ను సభలో ప్రవేశపెట్టనున్నారు. సీనియర్‌ మంత్రుల్లో ఒకరు శాసనమండలిలో ప్రవేశపెడతారు. బడ్జెట్‌పై చర్చ అనంతరం ద్రవ్య వినిమయ బిల్లును సభలో ఆమోదించి మండలికి పంపించనున్నారు. రాజభవన్‌ నుండి గవర్నర్‌ మాట్లాడుతూ... దేశవ్యాప్తంగా కరోనా తీవ్రత ఉన్న సమయంలో ఫ్రంట్‌ లైన్‌ వారియర్స్‌ సేవలను అభినందించారు. కరోనా సెకండ్‌ వేవ్‌ నేపథ్యంలో రాష్ట్రంలో అదనంగా కోవిడ్‌ కేర్‌ సెంటర్లను ఏర్పాటు చేసినట్లు చెప్పారు. ఆరోగ్యశ్రీ ని కోవిడ్‌ చికిత్సలో చేర్చామని అన్నారు. ఆరోగ్యశ్రీకి ప్రైవేట్‌ ఆస్పత్రుల్లో 50 శాతం బెడ్లను రాష్ట్ర ప్రభుత్వం కేటాయించిందని గవర్నర్‌ అన్నారు. కోవిడ్‌ వైరస్‌ బారినపడి మృతిచెందిన వారికి తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు. కరోనాతో ఆర్థిక రంగంపై మరోసారి ప్రభావం పడిందని, అయినా రాష్ట్రంలో సంక్షేమ కార్యక్రమాలను ప్రభుత్వం ఆపలేదని చెప్పారు. నాడు-నేడు, వసతి దీవెన, జగనన్న అమ్మఒడి, వైఎస్సార్‌ చేయూత తదితర పథకాలను అమలు చేస్తున్నట్లు గవర్నర్‌ వివరించారు. జాతీయ గీతాలాపనతో గవర్నర్‌ ప్రసంగం ముగిసింది.