అంతర్రాష్ట్ర సర్వీసులు, లోకల్ సర్వీసులకు బ్రేకులు

 


ఏపీలో కరోనా ఊహించని స్థాయిలో విస్తరిస్తోంది. రోజు రోజుకూ కేసులు రెట్టింపు అవుతున్నాయి. కరోనా కట్టడిలో భాగంగా గత కొన్ని రోజుల నుంచి కర్ఫ్యూ అమలు చేస్తోంది ఏపీ ప్రభుత్వం. ఆ ప్రభావం ఆర్టీసీ బస్సు సర్వీసులపై కనిపిస్తోంది. ముఖ్యంగా అంతర్రాష్ట్ర సర్వీసులను పూర్తిగా నిలిపివేసింది. ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకే అనుమతి ఉండటంతో ఆర్టీసీ సర్వీసులను భారీగా తగ్గించింది.

అంతర్రాష్ట్ర సర్వీసులు, లోకల్ సర్వీసులకు బ్రేకులు పడినా పార్సిల్ సర్వీసుల్ని మాత్రం ఆర్టీసీ కొనసాగిస్తోంది. కర్ఫ్యూ పరిస్థితుల్లోనూ పార్సిల్‌ సర్వీసులు నిరంతరాయంగా కొనసాగేలా ఆర్టీసీ ప్రత్యేక కార్యాచరణ చేపట్టింది. అందుకోసం డెడికేటెడ్‌ కారిడార్‌ కింద రాష్ట్రంలోని అన్ని జిల్లాలతోపాటు హైదరాబాద్‌ను అనుసంధానిస్తూ రోజుకు 9 ప్రత్యేక పార్సిల్‌ సర్వీసులను నిర్వహిస్తోంది. గుంటూరు-విశాఖపట్నం, అనంతపురం-విజయవాడ, తిరుపతి-విజయవాడ మధ్య రెండేసి పార్సిల్‌ సర్వీసులు నిర్వహిస్తోంది. రోజూ అటు వైపు నుంచి ఒక బస్సు.. ఇటువైపు నుంచి ఒక బస్సు నడుస్తుంది.


రాజమండ్రి-హైదరాబాద్, గుంటూరు-విజయవాడ-హైదరాబాద్, తిరుపతి-అనంతపురం మధ్య ఒక్కో పార్సిల్‌ సర్వీసు నిర్వహిస్తున్నారు. విశాఖపట్నం నుంచి శ్రీకాకుళం, విజయనగరం జిల్లాలకు పార్సిళ్లను ప్రయాణికుల బస్సుల్లో ఉదయం 6 నుంచి మధ్యాహ్నం 12 గంటల్లోపు చేరవేస్తున్నారు. అలాగే రాష్ట్రంలో అన్ని జిల్లాలతోపాటు హైదరాబాద్‌ను అనుసంధా నిస్తూ పార్సిల్‌ సేవలు అందిస్తున్నారు. ఇది కొంత ఊరట అని చెప్పాలి.