లాక్‌డౌన్‌లో సీక్రెట్‌గా బిగ్ బాస్ షూటింగ్.. సెట్‌ను సీల్ చేసిన పోలీసులు

 

కరోనా సెకండ్ వేవ్ విజృంభణతో దేశమంతా మళ్లీ లాక్‌డౌన్‌లోకి వెళ్లింది. కరోనా ఆంక్షలను కఠినంగా అమలు చేస్తున్నారు. అన్నింటితో పాటు సినిమాలు, టీవీ షూటింగ్‌లను కూడా నిలిపివేశారు. కానీ మలయళం బిగ్ బాస్ షో నిర్వాహకులు మాత్రం గుట్టుచప్పుడు కాకుండా షూటింగ్ చేస్తున్నారు. లాక్‌డౌన్ నిబంధనలను ఉల్లంఘించి తమ షో పనులను కానిచ్చేస్తున్నారు. అంతేకాదు బిగ్ బాస్ షోలో పనిచేసే 8 మంది సిబ్బంది కరోనా బారినపడ్డారు. ఐనప్పటికీ నిబంధనలకు విరుద్ధంగా షూటింగ్ నిర్వహిస్తున్నారు. ఈ వ్యవహారం పోలీసుల దృష్టికి వెళ్లడంతో వారు బిగ్ బాస్ సెట్‌కు వెళ్లి షూటింగ్ నిలిపివేశారు. హౌస్ మేట్స్ అందరినీ అక్కడి నుంచి హోటల్‌కు పంపించారు.మలయాళం బిగ్ బాస్‌ షోకు సూపర్ స్టార్ మోహన్ లాల్ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం మూడో సీజన్ నడుస్తోంది. ఐతే షో సగం పూర్తైన తర్వాత కేరళలతో పాటు ఇతర రాష్ట్రాల్లోనూ లాక్‌డౌన్ విధించారు. సినిమా, టీవీ షూటింగ్స్ పైనా ఆంక్షలున్నాయి. ఐనప్పటికీ బిగ్ బాస్ నిర్వాహకులు మాత్రం కంటెస్టెంట్లను చెన్నైకి తరలించారు. చెంబరంబాక్కంలో ఉన్న ఈవీపీ ఫిలిం సిటీలో ప్రత్యేక సెట్ వేసి షూటింగ్ చేస్తున్నారు. ఇటీవలే ఆ సెట్‌లో పనిచేసే 8 మందికి కరోనా పాజిటివ్ వచ్చింది. ఐనా షూటింగ్‌ను ఆపకుండా.. అలాగే షో కొనసాగిస్తున్నారు.


14 మందితో ప్రారంభమైన బిగ్ బాస్ మలయళం 3 షోలో ప్రస్తుతం ఏడుగురు సభ్యులే ఉన్నారు. ఇప్పటికే 95 రోజులు ముగిశాయి. ఇటీవలే మరో రెండు వారాల పాటు షోను పొడిగించారు.


లాక్‌డౌన్ నిబంధనలు ఉన్నా.. సిబ్బందికి పాజిటివ్ వచ్చినా.. 95వ రోజుకు సంబంధించిన షూటింగ్‌ను యథావిధిగా నిర్వహించారు. ఈ వ్యవహారంపై ఫిర్యాదులు అందడంతో తిరువళ్లూరు ఆర్డీవో ప్రీతి పర్కావి మంగళవారం పోలీసులతో అక్కడికి వెళ్లి.. షూటింగ్‌ను నిలిపివేశారు. కంటెస్టంట్స్‌తో పాటు కెమెరామెన్స్, టెక్నీషియన్స్, ఇతర సిబ్బందిని సెట్ నుంచి బయటకు పంపించారు. అనంతరం సీల్ వేశారు. నిర్వాహకులపై ఎపిడెమిక్ యాక్ట్ కింద కేసులు నమోదు చేశారు. ఇంత జరిగినా బిగ్ బాస్ కొనసాగుతుందని నిర్వాహకులు తెలిపారు. దేశంలో చాలా చోట్ల రియాలిటీ షోల షూటింగ్‌లు జరుగుతున్నాయని వెల్లడించారు. జూన్ 4న గ్రాండ్ ఫినాలే యథావిధిగా జరుగుతుందని స్పష్టం చేశారు.