హైదరాబాద్‌లో 'ఆదిపురుష్‌' చిత్రీకరణ

 


రామాయణం ఆధారంగా తెరకెక్కుతోన్న పాన్‌ ఇండియా చిత్రం 'ఆదిపురుష్‌'. ఇందులో ప్రభాస్‌ కథానాయకుడు. శ్రీరాముని పాత్ర పోషిస్తున్నారు. మార్చి నెలాఖరు వరకూ మహారాష్ట్రలో చిత్రీకరణ చేశారు. ప్రస్తుతం అక్కడి కరోనా పరిస్థితులు, ప్రభుత్వం విధించిన కరోనా నిబంధనల దృష్ట్యా చిత్రీకరణ చేసే వీలు లేదు. అందుకని, మిగతా సినిమాను హైదరాబాద్‌లో చిత్రీకరించడానికి ప్రభాస్‌తో పాటు దర్శకుడు ఓం రౌత్‌, నిర్మాతలు 'టీ-సిరీస్‌' భూషణ్‌కుమార్‌-కృష్ణకుమార్‌ సన్నాహాలు చేస్తున్నారని తెలిసింది.


సంక్రాంతి తర్వాత ముంబైలో 'ఆదిపురుష్‌' చిత్రీకరణ ప్రారంభించారు. ఇప్పటివరకూ సుమారు 60 రోజులు చిత్రీకరణ చేశారు. మరో 90 రోజులు చిత్రీకరణ చేయాల్సి ఉంది. కరోనా వల్ల మరింత ఆలస్యం కాకూడదని హైదరాబాద్‌ వస్తున్నారట. బహుశా... ఈ నెల 15న ఓ స్టూడియోలో సెట్స్‌కు వెళ్లవచ్చని సమాచారం. అంతకు ముందే సీతగా నటిస్తున్న కృతీ సనన్‌, రావణుడిగా నటిస్తున్న సైఫ్‌ అలీ ఖాన్‌, ఇతర బృంద సభ్యులు హైదరాబాద్‌ రానున్నారు.


మహారాష్ట్రలో పరిస్థితులు చక్కబడినా... చిత్రీకరణలు ప్రారంభించడానికి కొంత సమయం పట్టేలా ఉంది. సినిమాలో అవుట్‌డోర్‌ కంటే ఇండోర్‌లో తీయాల్సిన సన్నివేశాలు ఎక్కువ. 'తానాజీ' చిత్రాన్ని దర్శకుడు ఓం రౌత్‌ ఇండోర్‌లో ఎక్కువ షూట్‌ చేశారు. ఇప్పుడు 'ఆదిపురుష్‌'కూ బ్లూమ్యాట్‌ నేపథ్యంలో సన్నివేశాల చిత్రీకరణ పూర్తి చేసి, ఆ తర్వాత విజువల్‌ ఎఫెక్ట్స్‌కి ఇచ్చే విధంగా ప్లాన్‌ చేశారు.


హైదరాబాద్‌లోని ఫిల్మ్‌ సిటీలో అందుకు అనుకూలమైన వాతావరణం ఉండటంతో ఇక్కడ చిత్రీకరణ చేయాలని నిర్ణయించినట్టు సమాచారం. చిత్రీకరణతో పాటు ఆర్టిస్డులకు కావాల్సిన వసతి సౌకర్యాలను ఫిల్మ్‌ సిటీలో ఏర్పాటు చేయవచ్చు. రిస్క్‌ ఫ్యాక్టర్‌ తక్కువ. అందుకని, కరోనా జాగ్రత్తలు తీసుకుంటూ చిత్రీకరణ చేయడానికి సిద్ధమయ్యారు. వీలైనంత త్వరగా సినిమా పూర్తి చేయాలని అనుకుంటున్నట్టు చిత్రబృందంలో ఒకరు తెలిపారు.