రష్యాలో ఓ పాఠశాలలో దారుణం

 


రష్యాలో ఓ పాఠశాలలో దారుణం చోటుచేసుకుంది. ఓ సాయుధ దుండగుడు జరిపిన బహిరంగ కాల్పుల్లో 10 మంది చిన్నారులతో పాటు ఓ ఉపాధ్యాయురాలు మృతి చెందింది. మరో 20మందికి పైగా చిన్నారుల పరిస్థితి విషమంగా ఉంది. కాల్పులు జరుగుతున్న సమయంలో కొందరు చిన్నారులు భవనం మూడో అంతస్తు నుంచి దూకి తప్పించుకుంటున్న దృశ్యాలు హృదయవిదారకంగా ఉన్నాయి.


రష్యాలోని కజాన్‌ నగరంలోని ఓ పాఠశాలలో సాయుధ దుండగుడు జరిపిన కాల్పులతో పాఠశాల భవనం రణరంగంగా మారిపోయింది. ప్రాణాలు కోల్పోయిన వారిలో ఎక్కువగా ఏడు, ఎనిమిదో తరగతి చిన్నారులే ఉన్నట్లు స్థానిక అధికారులు వెల్లడించారు. ఈ ఘటనలో మరో 30మందికిపైగా విద్యార్థులు తీవ్రంగా గాయపడగా వారందరినీ ఆసుపత్రులకి తరలించారు. వీరిలో దాదాపు 21 మంది ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉందని రష్యా అత్యవసర విభాగం వెల్లడించింది.


ఇక పాఠశాలలో కాల్పులతో మోత మోగుతున్న సమయంలోనే కొందరు విద్యార్థులు భవనం నుంచి బయటకు పరుగులు తీయగా.. మరికొందరు మాత్రం భవనం మూడో అంతస్తు నుంచి దూకి తప్పించుకునే ప్రయత్నం చేశారు. దీంతో వారు తీవ్ర గాయాలపాలైనట్లు తెలుస్తోంది. సమీప భవనంలోని కొందరు ఆ దృశ్యాలను చిత్రీకరించగా రష్యా మీడియా వాటిని ప్రసారం చేసింది. ఈ దారుణానికి ఒడిగట్టినట్లు భావిస్తున్న ఓ యువకుడి(19)ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కాల్పులకు గల కారణాలు తెలియాల్సి ఉంది. అయితే, కాల్పులకు పాల్పడ్డ యువకుడు ఆ పాఠశాల పూర్వ విద్యార్థేనని రష్యా మీడియా పేర్కొంది. ఈ ఘటనపై రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ప్రస్తుతం పాఠశాలలో కాల్పులు జరిగిన కజాన్‌ నగరం రష్యా రాజధాని మాస్కోకు దాదాపు 700కి.మీ దూరంలో ఉంది. అయితే, రష్యాలో పాఠశాలలపై ఇటువంటి ఘటనలు చాలా అరుదనే చెప్పవచ్చు. 2018లో ఓ విద్యార్థిని కాల్చి చంపిన ఘటన రష్యాలోని క్రైమియాలో చోటుచేసుకుంది.