నూకలమర్రి నుంచి అమెరికా వరకు...అమెరికాలో ఫుడ్‌ అండ్‌ డ్రగ్‌ అడ్మినిస్ట్రేషన్‌ సభ్యుడిగా ఎదిగిన డాక్టర్‌ గోలి మోహన్‌ ప్రస్థానంచదువే తలరాతను మారుస్తుందని గట్టిగా నమ్మాడు. పట్టుదలతో చదివి పరిశోధకుడై అమెరికా వెళ్లాడు. 72 దేశాల్లోని కంపెనీలతో మందుల వ్యాపారం చేస్తూనే పేరున్న క్యాన్సర్‌ సైంటిస్టులలో ఒకడిగా నిలిచాడాయన. వివిధ దేశాల్లో అభివృద్ధి మూలాల్ని అధ్యయనం చేసి, ఆ ఫలాలను పురిటిగడ్డకూ అందించాలన్నదే అతని తపన. తెలంగాణలోని మారుమూల గ్రామం నూకలమర్రి నుంచి బయల్దేరి అమెరికాలో ఫుడ్‌ అండ్‌ డ్రగ్‌ అడ్మినిస్ట్రేషన్‌ సభ్యుడిగా ఎదిగిన డాక్టర్‌ గోలి మోహన్‌ ప్రస్థానం స్ఫూర్తిదాయకం..


తెలంగాణ రాష్ట్రం రాజన్న సిరిసిల్ల జిల్లాలోని పుణ్యక్షేత్రమైన వేములవాడకు అతి సమీప గ్రామం నూకలమర్రి. అదే మోహన్‌ స్వగ్రామం. వ్యవసాయ కుటుంబానికి చెందిన గోలి నారాయణ, మల్లమ్మ దంపతుల నలుగురు కొడుకుల్లో రెండోవాడు తను. చదువుల కోసం ఏడో తరగతి తర్వాత ఊరు విడిచి వెళ్లాడు. కెమిస్ట్రీలో పీహెచ్‌డీ కోసం ఉస్మానియా యూనివర్సిటీ మెట్లెక్కాడు. సీఎస్‌ఐఆర్‌ ఫెలోషిప్‌తో చేసిన పీహెచ్‌డీ తనకు కొత్త మార్గాన్ని చూపింది. ఆ తర్వాత రెండు ఫార్మా కంపెనీల్లో పనిచేసిన అనుభవం.. తనలోని సైంటిస్టుతో పాటు వ్యాపారవేత్తను మేలుకొల్పింది. మోహన్‌ ప్రస్థానాన్ని 2007లో ఢిల్లీలో జరిగిన అంతర్జాతీయ కాన్ఫరెన్స్‌ మలుపు తిప్పిందని చెప్పవచ్చు. తాను సమర్పించిన పరిశోధన పత్రానికి మెచ్చిన అమెరికన్‌ సైంటిస్టులు.. ఆరు నెలల పాటు విజిటింగ్‌ సైంటిస్టుగా రమ్మని ఆఫర్‌ చేశారు. డల్లాస్‌లోని యూనివర్సిటీ ఆఫ్‌ టెక్సాస్‌ సౌత్‌ వెస్టర్న్‌ మెడికల్‌ సెంటర్‌.. అక్కడ నోబుల్‌ గ్రహీత ప్రొఫెసర్‌ జాన్‌ క్యాంప్‌బెల్‌ దగ్గర సైంటిస్టుగా పనిచేసే అవకాశం కల్పించారు. తాను ప్రిన్సిపల్‌ సైంటిస్టుగా.. యూనివర్సిటీ తరఫున నేషనల్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ హెల్త్‌ (ఎన్‌ఐఏహెచ్‌)కు పంపిన ప్రతిపాదనకు 20 మిలియన్‌ డాలర్ల గ్రాంటు రావడం మోహన్‌ ప్రతిభ అందరికీ తెలిసేలా చేసింది. ఆరు నెలలకే గ్రీన్‌కార్డును, అదే ఏడాది 'బెస్ట్‌ ప్రాసెస్‌ డెవలప్‌మెంట్‌ సైంటిస్టు' అవార్డునిచ్చి మరింత ప్రోత్సాహాన్నిచ్చింది. అది 2010లో అమెరికన్‌ కెమికల్‌ సొసైటీ.. 'వరల్డ్‌ బెస్ట్‌ కెమిస్ట్‌ ఆఫ్‌ ది ఇయర్‌' అవార్డు దక్కడానికి బాటలు వేసింది.


ఆ తర్వాత మోహన్‌.. 2011లో మెరువాక్స్‌ ఫార్మా పేరుతో రీసర్చ్‌ అండ్‌ డ్రగ్‌ డెవలప్‌మెంట్‌ కంపెనీని ఏర్పాటు చేశాడు. యూఎస్‌, యూకే, ఇటలీ, ఇజ్రాయిల్‌, దక్షిణాఫ్రికా సహా 72 దేశాల్లోని ఫార్మస్యూటికల్‌, బయోటెక్నాలజీ కంపెనీలకు హెచ్‌ఐవీ, హైపర్‌టెన్షన్‌, యాంటీ ఇన్‌ఫ్లమేటరీ మెడిసిన్‌ తయారీకి అవసరమయ్యే ముడిసరుకును అందించే వ్యాపారానికి శ్రీకారం చుట్టాడు. పేటెంట్‌ తీసుకుని బ్రెయిన్‌, బ్రెస్ట్‌ కేన్సర్‌ మందులపై పరిశోధన సాగిస్తున్నాడు. జంతువులపై ప్రయోగ దశలో ఉన్న తమ రీసర్చ్‌.. రెండేళ్లలో డ్రగ్‌ను అందుబాటులోకి తెస్తుందని భరోసా ఇస్తున్నారు.


అభివృద్ధిపై అధ్యయనం


వ్యాపారం నిమిత్తం ఏ దేశం వెళ్లినా.. అక్కడి భౌగోళిక పరిస్థితులు, అభివృద్ధికి తోడ్పడుతున్న వనరులు, ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు, ఉద్యోగాల సృష్టి.. అన్నింటినీ పరిశీలించి, అక్కడి నిపుణులతో చర్చించడం మోహన్‌కు అలవాటు. పరిశోధనలో సెడిటేషన్‌ అనే ప్రక్రియే అందుకు కారణమై ఉంటుందంటాడీ సైంటిస్టు. తాను బెస్ట్‌ అనుకున్న విధానాన్ని తన స్వరాష్ట్రంలో అమలు చేయడానికి అక్కడి కంపెనీల యాజమాన్యాలతో మాట్లాడి ఇక్కడ పెట్టుబడులు పెట్టేలా ప్రోత్సహిస్తున్నారు. తన సొంత జిల్లాలోని ముంపు గ్రామాల్లో కనీసం ఐదువేల మందికైనా ఉపాధి కల్పించేలా తన మిత్రుల కంపెనీలతో మంతనాలు జరుపుతున్నట్టు మోహన్‌ వివరించారు.