రఘరామకృష్ణంరాజు పాదాలకు గాయాలున్నాయి.సుప్రీం కు నివేదిక పంపిన మిలటరీ హాస్పిటల్

 


రఘురామ పాదాలకు గాయాలున్నట్టు నిర్ధారణ.. విచారణ వాయిదా

ఢిల్లీ : వైసీపీ రెబల్ ఎంపీ రఘురామ బెయిల్ పిటిషన్‌పై సుప్రీంకోర్టులో వాదనలు ముగిశాయి. ఆర్మీ ఆస్పత్రి నివేదికను న్యాయమూర్తి వినయ్ చరణ్‌ చదివి వినిపించారు. రఘురామ పాదాలకి గాయాలున్నట్టు నిర్ధారణ అయ్యింది. మెడికల్‌ బోర్డు రిపోర్ట్‌కి, ఆర్మీ ఆస్పత్రి చెకప్‌కి మధ్య ఏదో జరిగిందని ప్రభుత్వం తరఫు న్యాయవాది దవే అనుమానం వ్యక్తం చేశారు. కస్టడీలో చిత్రహింసలు నిజమేనని ఈ రిపోర్ట్‌లో తేలిందని పిటిషనర్ తరఫు న్యాయవాది ముకుల్ రోహత్గీ కోర్టుకు వివరించారు. రఘురామ తనకు తాను గాయాలు చేసుకున్నారని భావిస్తున్నారా..? అని ప్రభుత్వ తరఫు న్యాయవాదిని సుప్రీంకోర్టు ప్రశ్నించింది. మిలటరీ ఆస్పత్రి నివేదికను ఇరు పక్షాలకు మెయిల్‌ ద్వారా పంపిస్తామని ధర్మాసనం తెలిపింది. అనంతరం విచారణ సోమవారానికి వాయిదా వేయాలని ప్రభుత్వ తరపు న్యాయవాది దవే కోరగా.. తక్షణమే విచారణ పూర్తి చేయాలని కోరిన రోహత్గీ కోర్టును కోరారు. ఇలా రెండు వైపులా వాదనలు పూర్తయ్యాయి. అనంతరం విచారణను ఇవాళ మధ్యాహ్నం 2.30 గంటలకు వాయిదా వేస్తున్నట్లు దేశ అత్యున్నత న్యాయస్థానం ప్రకటించింది.

నివేదికలో తేలింది! : ఇవాళ ఉదయం నుంచే ఎంపీ రఘురామ బెయిల్ పిటిషన్‌పై సుప్రీంకోర్టులో వాదనలు ప్రారంభమయ్యాయి. ఆర్మీ ఆస్పత్రి నివేదికను న్యాయమూర్తి వినయ్ చరణ్‌ వివరించారు. ‘కాళ్లకు గాయాలున్నట్లు నివేదికలో ఉంది. కాలిలో ఎముక విరిగిందని నివేదికలో ఉంది’ అని వినయ్ స్పష్టం చేశారు. అందుకే తాము బెయిల్ కోరుతున్నామని రఘురామ తరఫు న్యాయవాది కోర్టును కోరారు. అంతేకాదు.. తక్షణమే ఈ కేసును సీబీఐకి అప్పగించాల్సిన అవసరం ఎంతైనా ఉందని ముకుల్ రోహిత్గీ కోర్టును కోరారు.

వాదనలు ఇలా జరిగాయ్.. 

ధర్మాసనం : ముగ్గురు వైద్యులు పరీక్షించారు.. ఎక్స్-రే, వీడియో కూడా పంపించారు. జనరల్ ఎడిమా ఉంది. ఫ్రాక్చర్ కూడా ఉందని నివేదికలో ఉంది.

ముకుల్ రోహత్గి : ఎంపీపై చిత్రహింసలు పెట్టారన్నది నిజమని నివేదిక చెబుతోంది. ఒక ఎంపీకే ఇలా ఉందంటే సామాన్యుల పరిస్థితి ఏంటి..?. వెంటనే బెయిల్ మంజూరు చేయాలి. దీనిపై సీబీఐ విచారణ జరపాలి.

ధర్మాసనం : మేము ఎంపీయా....? సామాన్యుడా..? అని చూడం.. పిటిషనర్ ఎవరైనా మా దృష్టిలో ఒకటే.

దవే : అవి స్వయంగా చేసుకున్న గాయాలా..? కాదా అన్నది తెలియదు. గాయాలున్నాయి అన్న ఒక్క కారణంతో బెయిల్ ఇవ్వడం సరికాదు. మా వాదనలు విన్న తర్వాత, కేసు మెరిట్స్ ఆధారంగా నిర్ణయం తీసుకోండి. విచారణ సోమవారానికి వాయిదా వేయండి.

రోహత్గీ : తక్షణమే విచారణ పూర్తి చేయాలి.