మంచినీటి సమస్య పరిష్కారానికి కొత్త పైపులైన్‌

 


నియోజకవర్గంలో ట్రాఫిక్‌ సమస్య తలెత్తకుండా ఉండేందుకు అన్ని ప్రధాన జంక్షన్లను యుద్ధ ప్రాతిపదికన అభివృద్ధి చేయాలని ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్‌ అన్నారు. ఇప్పటికే ఏయే జంక్షన్లను అభివృద్ధి చేయాలో చర్చించామని తెలిపారు. సోమవారం గోల్నాకలోని క్యాంపు కార్యాలయంలో జీహెచ్‌ఎంసీ టౌన్‌ ప్లానింగ్‌ అధికారులతో నియోజకవర్గంలోని జంక్షన్ల అభివృద్ధి విషయమై ఎమ్మెల్యే చర్చించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రధానంగా ట్రాఫిక్‌ సమస్య తలెత్తకుండా నారాయణగూడ వైఎంసీఏ, అంబర్‌పేట అలీకేఫ్‌ జంక్షన్లను పూర్తిస్థాయిలో అభివృద్ధి చేయాలని సూచించారు.


మూసారాంబాగ్‌ వద్ద మూసీ నది వెంబడి రోడ్డు నిర్మాణం చేపట్టడం, అదే విధంగా నియోజకవర్గంలోని పలు ప్రాంతాల్లో ఏసీ బస్‌స్టాపులను ఏర్పాటు చేయాలనే అంశాలను చర్చించారు. సాధ్యమైనంత వరకు ప్రతిపాదనలు సిద్ధం చేసి పనులు మొదలు పెట్టాలని సూచించారు. కార్యక్రమంలో సికింద్రాబాద్‌ జోన్‌ సిటీ ప్లానర్‌ రంజిత్‌కుమార్‌, సెక్షన్‌ అధికారులు వరప్రసాద్‌, సాయిబాబా పాల్గొన్నారు.


మంచినీటి సమస్య పరిష్కారానికి కొత్త పైపులైన్‌


బాగ్‌అంబర్‌పేట డివిజన్‌ వైభవ్‌నగర్‌ కాలనీలో మంచినీటి సమస్య పరిష్కారానికి కొత్త పైపులైన్‌ ఏర్పాటు చేయనున్నట్లు ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్‌ అన్నారు. సోమవారం ఆయన కాలనీలో పర్యటించి అక్కడి సమస్యలు తెలుసుకున్నారు. ప్రధానంగా స్థానికులు మంచినీటి సమస్య తీవ్రంగా ఉందని ఎమ్మెల్యే దృష్టికి తెచ్చారు. దీనికి స్పందించిన ఆయన జలమండలి అధికారులను పిలిపించి వైభవ్‌నగర్‌లో కొత్త మంచినీటి పైప్‌లైన్‌ ఏర్పాటుకు ప్రతిపాదనలు తయారు చేయాలని చెప్పారు. కార్యక్రమంలో జలమండలి డీజీఎం సతీష్‌, ఏఈ మాజిత్‌, వర్క్‌ ఇన్‌స్పెక్టర్‌ బాలకృష్ణ, కాలనీ వాసులు వెంకటరెడ్డి, గణేష్‌, విజయ్‌, టీఆర్‌ఎస్‌ నాయకులు శ్రీరాములుముదిరాజ్‌ తదితరులు పాల్గొన్నారు.