దక్షిణ భారతదేశంలో తొలిసారిగా హార్బర్‌ బ్యాక్‌డ్రాప్‌లో జెట్టీ

 


దక్షిణ భారతదేశంలో తొలిసారిగా హార్బర్‌ బ్యాక్‌డ్రాప్‌లో జెట్టీ చిత్రాన్ని రూపొందిస్తున్నట్లు నిర్మాత వేణుమాధవ్‌ చెప్పారు. నందితా శ్వేత కథానాయిక నటిస్తున్న ఈ చిత్రంతో నూతన నటుడు కృష్ణ హీరోగా, సుబ్రహ్మణ్యం పిచ్చుక దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. షూటింగ్‌ పార్ట్‌ పూర్తి చేసుకొన్న ఈ చిత్రం టైటిల్‌ లోగోను టీమ్‌ మంగళవారం విడుదల చేసింది. తెలుగు సహా తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో ఈ సినిమా రూపుదిద్దుకుంటోంది. 'మత్స్యకారుల నేపథ్యంలో తెలుగు తెరపై ఇంతవరకూ చూడని కథతో ఈ సినిమా తయారవుతోంది. ప్రపంచీకరణతో మారుతున్న జీవనశైలిలో తాము నమ్ముకొన్న సముద్రం మీద ఆధారపడుతూ అలలతో పోటీ పడుతూ పొట్ట పోసుకొంటున్న జీవితాలను ఎంతో సహజంగా మా దర్శకుడు చిత్రీకరించాడు. సముద్రపు ఒడ్డున నివాసం ఏర్పాటు చేసుకొని, సముద్రపు అలలపైన జీవిత పయనం సాగించే మత్స్యకారుల గ్రామాలు ఎన్నో ఉన్నాయి. అటువంటి ఓ గ్రామంలో జరిగిన కథ ఇది' అని నిర్మాత చెప్పారు.


దర్శకుడు సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ ' కొన్ని వందల గ్రామాలు, కొన్ని వేల మత్స్యకార కుటుంబాలు , కొన్ని తరాల పోరాటం, వారి కల ఓ గోడ. దాని పేరు జెట్టీ. ఈ అంశాన్ని తీసుకుని చిత్రాన్ని నిర్మించాం. షూటింగ్‌ పార్ట్‌ పూర్తయింది. ప్రస్తుతం పోస్ట్‌ ప్రొడక్షన్‌ కార్యక్రమాలు జరుగుతున్నాయి. మా సినిమాలో సిద్‌ శ్రీరామ్‌ పాడిన పాట హైలైట్‌గా ఉంటుంది. త్వరలో ఆ పాట విడుదల చేస్తాం' అని తెలిపారు.