సీఈవో పదవికి జెఫ్ బెజోస్ గుడ్‌బై!



ప్రపంచ కుబేరుడు, ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్ సంస్థ సీఈవో జెఫ్ బెజోస్ తన పదవి నుంచి తప్పుకోనున్నారు. జూలై 5న తాను అమెజాన్ సీఈవో పదవి నుంచి తప్పుకుంటానని బెజోస్ తాజాగా ప్రకటించారు. తన స్థానంలో అమెజాన్ ఎగ్జిక్యూటివ్, వెబ్‌ సర్వీస్‌ హెడ్‌ ఆండీ జెస్సీ నూతన సీఈవోగా పదవీ బాధ్యతలు స్వీకరించనున్నారని తెలిపారు. ఇకపై బెజోస్ అమెజాన్ ఎగ్జిక్యూటివ్ ఛైర్మన్‌గా వ్యవహరించనున్నారు.

జులై 5 తనకు చాలా సెంటిమెంట్ డేట్ అని, అందుకే ఆ రోజే పదవి నుంచి తప్పుకోవాలని నిర్ణయించుకున్నట్టు బెజోస్ తెలిపారు. బుధవారం జరిగిన అమెజాన్ షేర్ హోల్డర్స్ మీటింగ్‌లో ఈ ప్రకటన చేశారు. `సరిగ్గా 27 ఏళ్ల క్రితం అదే రోజున అమెజాన్ సంస్థ ప్రారంభమైంది. అందుకే ఆ తేదీ నాకు చాలా ప్రత్యేకమైనద`ని బెజోస్ అన్నారు. కాగా, 1997లో అమెజాన్‌లో మార్కెటింగ్ మేనేజర్‌గా చేరిన ఆండీ జెస్సీ అదే సంస్థలో అంచెలంచెలుగా ఎదిగారు. 2003లో అమెజాన్ వెబ్ సర్వీసెస్ ఏర్పాటులో జెస్సీ కీలక భూమిక పోషించారు.