సర్కారు కాలేజీల్లో వాట్సాప్‌ ద్వారా ప్రవేశాలు కల్పించేదిశగా ఇంటర్‌బోర్డు అధికారులు కసరత్తు

 


సర్కారు కాలేజీల్లో వాట్సాప్‌ ద్వారా ప్రవేశాలు కల్పించేదిశగా ఇంటర్‌బోర్డు అధికారులు కసరత్తు చేస్తున్నారు. ఇటీవలే కొంతమంది అధికారులు వాట్సాప్‌ ద్వారా ప్రవేశాలు కల్పించే అంశంపై ఇంటర్‌బోర్డు కార్యదర్శి సయ్యద్‌ ఒమర్‌ జలీల్‌తో చర్చించగా, సాధ్యాసాధ్యాలను పరిశీలించాలని ఆదేశించినట్టు తెలిసింది. కరోనా దృష్ట్యా గతేడాది ఇంటర్‌ కాలేజీల్లో ఆన్‌లైన్‌లో అడ్మిషన్లు చేపట్టగా, ఈ ఏడాది ఆన్‌లైన్‌తోపాటు వాట్సాప్‌ బేస్డ్‌ అడ్మిషన్లు కల్పించాలన్న అంశాన్ని అధికారులు పరిశీలిస్తున్నారు. ఇంటర్‌ ఫస్టియర్‌ ప్రవేశాలు ఈ నెల 25 నుంచి ప్రారంభమైన విషయం తెలిసిందే. మొదటి విడత అడ్మిషన్ల షెడ్యూల్‌ను విడుదల చేసిన అధికారులు, జూలై 5 వరకు ప్రవేశాలకు అవకాశం కల్పించారు. వాట్సాప్‌ ప్రవేశాలపై త్వరలోనే నిర్ణయం తీసుకొంటామని జలీల్‌ పేర్కొన్నారు.


ప్రక్రియ ఇలా..


విద్యార్థులు తాము చేరాల్చిన కాలేజీ ప్రిన్సిపాల్‌ వాట్సాప్‌ నెంబర్‌కు ఎస్సెస్సీ మార్కుల మెమో, ఆధార్‌కార్డు నంబర్‌, కోర్సు, మీడియం, రెండో భాషలను (సెకండ్‌ లాంగ్వేజ్‌) వివరాలను పంపించాలి.

కాలేజీ ప్రిన్సిపాళ్లు ఇంటర్‌ వెబ్‌సైట్‌లో విద్యార్థి వివరాలన్నింటినీ నమోదుచేస్తారు.

వివరాలన్నీ వెబ్‌సైట్‌లో ఎంటర్‌ చేయగానే, ప్రవేశాల ప్రక్రియ పూర్తవుతుంది. అడ్మిషన్‌ పూర్తిచేసినట్టు ధ్రువీకరించి, కేటాయించిన అడ్మిషన్‌ నంబర్‌ను సదరు విద్యార్థి వాట్సాప్‌ నంబర్‌కు పంపుతారు.