ఢిల్లీ సరిహద్దుల్లో రైతులు చేస్తున్న ఆందోళనలకు నేటితో ఆరునెలలు

 


కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన వివాదాస్పద సాగు చట్టాలను రద్దు చేయాలని కోరుతూ ఢిల్లీ సరిహద్దుల్లో రైతులు చేస్తున్న ఆందోళనలకు నేటితో ఆరునెలలు పూర్తయ్యాయి. ఈ నేపథ్యంలో నేడు బ్లాక్‌ డేగా పాటించాలని రైతు సంఘాలు నిర్ణయించాయి. అదేవిధంగా నేడ ప్రధానిగా నరేంద్ర మోదీ పాలనకు ఏడేళ్లు పూర్తి కానున్నాయి. ఈ సందర్భాన్ని బ్లాక్ డే (చీకటి రోజుగా) గుర్తిస్తూ రైతు సంఘాలు నిరసనలకు పిలుపునిచ్చాయి. గ్రామాలు మొదలుకొని ఢిల్లీ దాకా ఇళ్లు, దుకాణాలపై నల్లజెండాలను ఎగురవేయాలని, వాహనాలకు నల్లజెండాలు కట్టుకోవాలని పిలుపునిచ్చారు. కాగా, బ్లాక్‌డే సందర్భంగా ఢిల్లీలో పోలీసులు గస్తీని పెంచారు. లాక్‌డౌన్ నిబంధనలు పాటించాలని అధికారులు సూచించారు.

వ్యవసాయ చట్టాలకు నిరసనగా 'చలో ఢిల్లీ' నినాదంతో రైతులు గతేడాది నవంబర్‌ 26న ఢిల్లీ సరిహద్దులకు చేరుకున్నారు. అప్పటి నుంచి ఢిల్లీ సరిహద్దుల్లో నిరసనలు కొనసాగిస్తున్నారు. వణికించే చలిని కూడా లెక్కచేయకుండా రైతులు చాలారోజుల పాటు ఢిల్లీ సరిహద్దులను దిగ్బంధించిన విషయం తెలిసిందే.


కేంద్రంతో పలుమార్లు రైతు సంఘాల చర్చలు జరిగినప్పటికీ అవి విఫలమయ్యాయి. అప్పటినుంచి దేశనలుమూలల నుంచి రైతులు ఢిల్లీ సరిహద్దుల్లోని టిక్రి, సింఘు, ఘాజీపూర్‌లలోని ధర్నా స్థలాలకు వచ్చి ఉద్యమానికి మద్దతు తెలుపుతున్నారు.