హైదరాబాద్ మహా నగరాన్ని ట్రాఫిక్ సమస్య ఇంకనూ పట్టి పీడిస్తూనే ఉంది. మహా నగరానికి ఔటర్ రింగు రోడ్డు మణిహారంలా మారింది. నగరం
నుంచి ఇతర జిల్లాలు, రాష్ర్టాలకు వెళ్లాలన్నా ఎంతో సులభంగా చేరుకునే నగరం చుట్టూ ఔటర్ రింగు రోడ్డు 158 కి.మీ పొడవునా అందుబాటులో ఉంది. ప్రధానంగా ఐటీ కారిడార్‌లోని గచ్చిబౌలి నుంచి నార్సింగి వద్దనున్న ఔటర్ రింగు రోడ్డు వరకు ఉన్న లింకు రోడ్డుతో పాటు అటు శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం వైపు, ఇటు కొల్లూరు వైపు ఉన్న ఓఆర్ఆర్ పూర్తిగా ఐటీ కారిడార్‌లో భాగంగా ఉంది. దీంతో ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన తర్వాత నగరానికి పడమర దిక్కున ఉన్న ఐటీ కారిడార్ ప్రాంతం శరవేగంగా అభివృద్ధి చెందింది.
దీంతో ఇక్కడ జాతీయ, అంతర్జాతీయ ఐటీ, ఐటీఈఎస్ కార్యాలయాలతో పాటు నివాస ప్రాంతాలు భారీ సంఖ్యలో వెలిశాయి. ఫలితంగా ఔటర్ రింగు రోడ్డుకు ఇరువైపులా ఉన్న ప్రాంతాలైన గచ్చిబౌలి, నానక్‌రాంగూడ, నార్సింగి, కోకాపేట, మంచిరేవుల, కొల్లూరు, తెల్లాపూర్, గౌలిదొడ్డి, గోపన్‌పల్లి ప్రాంతాల్లో ఐటీ ఉద్యోగులు స్థిర నివాసాలను ఏర్పాటు చేసుకున్నారు. దీంతో ఈ ప్రాంతంలో ఒక్కసారిగా జన సాంద్రత పెరిగింది. ఔటర్ రింగు రోడ్డు నిర్మాణ సమయంలో మెయిన్ క్యారేజ్ వేను ఎనిమిది వరసల్లో నిర్మించారు. కాని, దానికి ఇరువైపులా సర్వీసు రోడ్లు 2 వరసల్లోనే నిర్మించారు. అయితే, ఐటీ కారిడార్‌లో ఊహించిన స్థాయిలో అభివృద్ధి చోటు చేసుకోవడంతో ఈ ప్రాంతంలో ఐటీ కార్యాలయాలకు వచ్చే వారితో పాటు ఆ చుట్టూ నివాసం ఉండే వారిలో ఈ ప్రాంతం రద్దీగా మారింది. కోకాపేట, నార్సింగి కేంద్రంగా మూడు వైపులా వెళ్లే ఔటర్ రింగు రోడు సర్వీసు రోడ్లపై విపరీతంగా ట్రాఫిక్ రద్దీ పెరిగింది.
రూ.312 కోట్లతో సర్వీసు రోడ్ల విస్తరణ..
గచ్చిబౌలి ఫైనాన్సియల్ డిస్ట్రిక్ట్ నుంచి నగరానికి అనుసంధానం అయ్యేందుకు నానక్‌రాంగూడ ఓఆర్ఆర్ ఇంటర్ ఛేంజ్ కీలకంగా మారింది.
ఇక్కడ నుంచి బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, మాదాపూర్, రాయదుర్గం ప్రాంతాలకు రావాలన్నా, వెళ్లాలన్నా నానక్‌రాంగూడ ఇంటర్ ఛేంజ్ ప్రధాన కూడలిగా ఉంది.
పాత ముంబై హైవేపై ఉన్న రాయదుర్గం నుంచి నానక్‌రాంగూడ వరకు వచ్చేందుకు 120 అడుగుల వెడల్పుతో రోడ్లు ఉన్నాయి.
అక్కడి నుంచి నార్సింగి, కోకాపేట, మంచిరేవుల, శంషాబాద్ వైపు వెళ్లాలంటే ఓఆర్ఆర్ సర్వీస్ రోడ్లు తప్ప మరో అనువైన మార్గం లేదు.
దీంతో నానక్‌రాంగూడ నుంచి నార్సింగి మీదుగా రాజేంద్రనగర్, హిమాయత్ సాగర్ల వద్దనున్న తెలంగాణ పోలీసు అకాడమీ వరకు ఉన్న సర్వీసు రోడ్డును విస్తరించాలని నిర్ణయించారు.
అదే విధంగా నార్సింగి నుంచి కోకాపేట మీదుగా కొల్లూరు వరకు ఉన్న సర్వీసు రోడ్లను విస్తరించాలని నిర్ణయించారు.
ఇందుకు సుమారు రూ.312 కోట్లు ఖర్చవుతాయని హెచ్ఎండీఏ ఇంజనీరింగ్ అధికారులు అంచనాలు సిద్ధం చేశారు.
ఈ ప్రాంతంలో ట్రాఫిక్ రద్దీ పెరిగిన నేపథ్యంలో ఇప్పటికే, ఐటీ కారిడార్‌లోని నార్సింగి వద్ద, కోకాపేట మూవీ టవర్స్ వద్ద కొత్తగా ఇంటర్ ఛేంజ్‌లను నిర్మిస్తున్నారు.
అయినా, ఐటీ కారిడార్‌లోని ఔటర్ రింగు రోడ్డుకు ఇరువైపులా మరింత అభివృద్ధి జరిగేందుకు అవకాశం ఉండటంతో సర్వీస్ రోడ్లను విస్తరించాలని హెచ్ఎండీఏ నిర్ణయించింది.