క్యూబన్‌ సాంస్కృతిక సంస్థ ఖండన

 


కొలంబియాలో ఇవాన్‌ డ్యూక్‌ ప్రభుత్వ నయా ఉదారవాద విధానాలు, నిరంకుశ పోకడలకు వ్యతిరేకంగా ప్రజాగ్రహం పెల్లుబుకుతోంది. ఎక్కడికక్కడ ప్రజలు వీధుల్లోకి వచ్చి నిరసనలు తెలుపుతున్నారు. ప్రభుత్వం తీవ్ర నిర్బంధాన్ని ప్రయోగించినప్పటికీ ఏమాత్రం లెక్క చేయకుండా దేశ వ్యాపితబంద్‌కు దిగారు. ఈ సందర్భంగా ఆందోళనకారులపై పోలీసులు క్రూరమైన నిర్బంధకాండకు దిగారు. ఈ దాడులను కొలంబియా సామాజిక, పౌర సంస్థలు తీవ్రంగా ఖండించాయి. పోలీసుల క్రూరత్వ చర్యలకు స్వస్తి పలకాలని, ప్రజల జీవన పరిస్థితులను మెరుగుపరిచేందుకు చర్యలు తీసుకోవాలని ఈ సంస్థలు గొంతెత్తాయి. దేశవ్యాప్తంగా, చాలాచోట్ల సాయుధులు, ప్రదర్శనకారులను అడ్డుకున్నట్లు వార్తలందాయి. కొన్ని చోట్ల కాల్పులు కూడా జరిగాయి. నిరసనల సందర్భంగా దాదాపు 24చోట్ల దాడులు జరిగాయని ఓంబుడ్స్‌మన్‌ కార్యాలయం తెలిపింది. ఈ ప్రదర్శనల్లో 11మంది చనిపోయారని అటార్నీ జనరల్‌ కార్యాలయం తెలిపింది. వీటిల్లో ఏడు కేసులను నిర్ధారించారు కానీ మరో ఆరు హత్యలకు, నిరసనలతో సంబంధం లేదని తేలింది. ఏప్రిల్‌ 5న ఈ నిరసన ప్రదర్శనలు ప్రారంభమయ్యాయి. పెరిరాలో బుధవారం జరిగిన దాడిలో గుర్తు తెలియని దుండగులు ముగ్గురు యువకులను తీవ్రంగా గాయపరిచారు. శాంతియుతంగా ప్రదర్శన చేస్తుండగా జరిపిన ఈ దాడిలో యూనివర్శిటీ విద్యార్ధి లూకాస్‌ విల్లాకు 8 కత్తిపోట్లు తగిలాయి. ఆస్పత్రిలో చేర్చగా పరిస్థితి విషమంగా వుందని డాక్టర్లు తెలిపారు.

క్యూబన్‌ సాంస్కృతిక సంస్థ ఖండన


కొలంబియాలో జాతీయ సమ్మె చట్రపరిధిలో సాగుతున్న సామాజిక నిరసనలకు వ్యతిరేకంగా అధ్యక్షుడు ఇవాన్‌ డ్యూక్‌ ప్రభుత్వం సాగిస్తున్న అణచివేత చర్యలకు క్యూబా సాంస్కృతిక సంస్థ గురువారం ఖండించింది. దేశంలో నెలకొన్న పరిస్థితులకు వ్యతిరేకంగా వారం రోజులకు పైగా ప్రదర్శనలు, సమావేశాలు సాగిన తర్వాత భద్రతా బలగాలు హింసాత్మక దాడులకు పాల్పడడాన్ని ఖండించింది. కొలంబియా ప్రజల డిమాండ్లకు సంఘీభావాన్ని ప్రకటించింది. శాంతియుత వాతావరణం ఏర్పడితేనే వాస్తవ న్యాయానికి మార్గం సుగమమవుతుందని వ్యాఖ్యానించింది.