కరోనాతో పోరాడుతున్న భారత్‌కు ఏరో స్పేస్‌ దిగ్గజం బోయింగ్‌ అండ

 


కరోనాతో పోరాడుతున్న భారత్‌కు ఏరో స్పేస్‌ దిగ్గజం బోయింగ్‌ అండగా నిలిచింది. పది మిలియన్‌ డాలర్ల అత్యవసర సహాయ ప్యాకేజీ శుక్రవారం ప్రకటించింది. మహమ్మారిపై పోరాడుతున్న వారికి వైద్య పరికరాలు అందించడం సహా ఇతర కార్యక్రమాలు చేపడుతున్న భారత్​లోని సంస్థలకు ఈ సహాయాన్ని అందిస్తామని వెల్లడించింది. బోయింగ్​ను ప్రపంచ పౌరుడిగా అభివర్ణించిన ఆ సంస్థ సీఈఓ డేవ్ కల్హౌన్.. మహమ్మారి ప్రపంచంలోని కమ్యూనిటీలను నాశనం చేసిందన్న ఆయన.. ఈ విపత్కర సమయంలో భారత్​లోని ప్రజలకు సానుభూతి వ్యక్తం చేస్తున్నట్లు తెలిపారు.


వైద్య, ప్రభుత్వ, ప్రజారోగ్య నిపుణులతో సంప్రదించి అత్యవసరంగా అవసరమయ్యే ప్రాంతాలకు సహాయం అందించేందుకు స్థానిక, అంతర్జాతీయ సంస్థలను భాగస్వాములను చేయనున్నట్లు పేర్కొన్నారు. అలాగే బోయింగ్‌ ఉద్యోగులు సైతం భారత్‌ సహాయ కార్యక్రమాల కోసం వ్యక్తిగతం విరాళాలు ఇవ్వొచ్చని సంస్థ ఒక ప్రకటనలో తెలిపింది. ఉద్యోగి ఇచ్చిన విరాళానికి అంతే మొత్తాన్ని జమ చేసి సహాయంలో సంస్థ భాగమవుతుందని పేర్కొంది. మహమ్మారిని ఎదుర్కొనే ప్రయత్నంలో బోయింగ్‌ భారతీయ ప్రజలకు సంఘీభావంగా నిలబడడమే కాకుండా.. సమస్య పరిష్కారంలో భాగస్వాములమవుతామని పేర్కొంది.