ప్రధాన ఎత్తిపోతల పథకాలను ఈ ఏడాది వానాకాలం నాటికి పూర్తి

 

రాష్ట్రంలోని ప్రధాన సాగునీటి ఎత్తిపోతల పథకాలన్నీ జూన్, జూలై నాటికి అందుబాటులోకి రానుండటంతో అందుకు అనుగుణంగానే విద్యుత్‌ డిమాండ్‌ ఎన్నడూ లేనంతగా ఉండనుంది. గత ఏడాది వినియోగానికి అదనంగా 3 వేల మెగావాట్లు కలుపుకొని మొత్తంగా 6,520 మెగావాట్ల విద్యుత్‌ అవసరాలు ఉంటాయని ఇరిగేషన్‌ శాఖ ప్రాథమిక అంచనా. కాళేశ్వరం సహా అన్ని ప్రధాన ప్రాజెక్టుల్లోని పంప్‌హౌస్‌ల్లో కనీసం నాలుగు నెలల పాటు మోటార్లను నడపాల్సి ఉంటుందంటూ లెక్కగట్టింది. ఒక్క కాళేశ్వరం ప్రాజెక్టు పరిధిలోనే కనీసం 4,720 మెగావాట్ల విద్యుత్‌ అవసరాలుంటాయని విద్యుత్‌ శాఖకు నివేదించింది. -సాక్షి, హైదరాబాద్‌ప్రధాన ఎత్తిపోతల పథకాలను ఈ ఏడాది వానాకాలం నాటికి పూర్తి చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఇందులో దేవాదుల, కాళేశ్వరంలోని మల్లన్నసాగర్, బస్వాపూర్‌ రిజర్వాయర్లు, పాక్షికంగా డిండి, పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతలను పూర్తి చేయడంతోపాటు ఇప్పటికే సిద్ధమైన కల్వకుర్తి, భీమా, నెట్టెంపాడు, కోయిల్‌సాగర్‌ వంటి ఎత్తిపోతల పథకాల కింద పూర్తి స్థాయిలో ఆయకట్టుకు నీరివ్వాలని సీఎం కేసీఆర్‌ నిర్ణయించారు. వర్షాలు ఏమాత్రం సహకరించకపోయినా, కృష్ణా, గోదావరిలో వచ్చిన నీటిని వచ్చినట్లుగా ఎత్తిపోతల పథకాల ద్వారా మళ్లించుకోవాలని దిశానిర్దేశం చేశారు.


ప్రస్తుతం ప్రాజెక్టుల వారీగా నీటిని తీసుకునే రోజులు, నడపనున్న పంపులు, ఎత్తిపోసే నీళ్లు ఆధారంగా ఎంత విద్యుత్‌ అవసరాలు ఉన్నాయో లెక్కించాలని సూచించారు. ఇప్పటివరకు కల్వకుర్తి, బీమా, నెట్టెంపాడు, అలీసాగర్, ఏఎంఆర్‌పీ, దేవాదుల, కోయిల్‌సాగర్‌ వంటి ఎత్తిపోతల పథకాలు పనిచేస్తుండగా, వీటికి గరిష్టంగా 1,500 మెగావాట్ల విద్యుత్‌ అవసరం అవుతోంది. అయితే ఈ ఏడాది దేవాదుల కింద పూర్తి ఆయకట్టుకు నీళ్లివ్వాలని భావిస్తున్నారు. ఇప్పటికే సమ్మక్కసాగర్‌ బ్యారేజీ నిండిన నేపథ్యంలో దీనికి నీటి లభ్యత పెరగనుంది.


ఈ నేపథ్యంలో ఖరీఫ్‌లో కనీసంగా 20 టీఎంసీల నీటినైనా ఎత్తిపోయాలని భావిస్తున్నారు. ఇక్కడి అన్ని ప్యాకేజీల్లో కలిపి 48 మోటార్లు ఉండగా, 500 మెగావాట్లు అవసరమని లెక్కగట్టారు. ఇక పాలమూరులోని ప్రాజెక్టుల కింద కనీసం 8 లక్షల ఎకరాల ఆయకట్టుకు నీరందించేలా కృష్ణాలోకి వచ్చే నీటిని ఎత్తిపోయాల్సి ఉంటుంది. ఈ ప్రాజెక్టుల్లోని 40 మోటార్లు తిరిగినా 800 మెగావాట్ల విద్యుత్‌ అవసరం ఉంటుంది.