బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం

 


బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం సోమవారం ఉదయం 'యాస్‌' తుపానుగా మారనుండటంతో రాష్ట్రంలో నాలుగు జిల్లాల్లో భారీగా వర్షాలు కురిసే అవకాశం వుందని స్థానిక వాతావరణ పరిశోధన కేంద్రం అధికారులు వెల్లడించారు. తూర్పు - మధ్య బంగాళాఖాతంలో శనివారం ఏర్పడిన అల్పపీడనం మరింతగా బలపడి ఆదివారం వాయుగుండంగా మారిందని, ఉత్తర వాయువ్య దిశగా పయనిస్తూ సోమవారం ఉదయానికల్లా 'యాస్‌' తుపానుగా ఉగ్రరూపం దాల్చుతుందని పేర్కొన్నారు. ఈ తుపాను కారణంగా సముద్రంలో పెనుగాలులు వీస్తాయని, తీరం వైపు ఉవ్వెత్తున రాక్షస అలలు ఎగసిపడతాయని తెలిపారు. తుపాను ప్రభావం కారణంగా నాలుగు రోజులపాటు జాలర్లు చేపలవేటకు వెళ్ళరాదని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. యాస్‌ తుపాను ప్రభావంతో కన్నియాకుమారి, నీలగిరి, తేని, దిండుగల్‌ జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో భారీగాను, కుండపోతగాను వర్షాలు కురుస్తాయని తెలిపారు. సేలం, కృష్ణగిరి, తిరుచ్చి, అరియలూరు, పెరంబలూరు, మదురై, తిరునల్వేలి, తెన్‌కాశి జిల్లాల్లో పుదుచ్చేరి, కారైక్కాల్‌ ప్రాంతాల్లో ఓ మోస్తరుగా వర్షాలు కురుస్తాయని పేర్కొన్నారు. సోమవారం కన్నియాకుమారి జిల్లాల్లో కుండపోతగా వర్షాలు కురిసే అవకాశముందని, సేలం, కృష్ణగిరి, ధర్మపురి, వేలూరు, రాణిపేట, తిరుపత్తూరు జిల్లాల్లో తేలికపాటి వర్షాలు కురుస్తాయని తెలిపారు.


సోమ, మంగళవారాల్లో తుపాను కారణంగా తీరం పొడవునా గంటకు 50 నుండి 60 కి.మీ. వేగంతో పెనుగాలులు వీస్తాయని, జాలర్లకు చేపలవేటకు వెళ్ళకూడదని తెలిపారు. మన్నార్‌ జలసంధి ప్రాంతంలో బుధవారం గంటకు 55 నుంచి 65 కి.మీ. వేగంతో సుడిగాలులలు వీస్తాయని అధికారులు వివరించారు.