హుజూరాబాద్ బాధ్యతను కూడా హరీష్ రావుకు అప్పగించే అవకాశాలు

 


తనకు అప్పగించిన బాధ్యతను సమర్థంగా నిర్వహిస్తారనే పేరు మంత్రి హరీష్ రావుకు ఉంది. సాధారణ ఎన్నికల్లోనైనా, ఉప ఎన్నికల్లోనైనా టీఆర్ఎస్ అభ్యర్థి బాధ్యతను ముఖ్యమంత్రి కేసీఆర్ తనకు అప్పగిస్తే సమర్థంగా నిర్వహిస్తారని, పార్టీని గెలిపించి తీరుతారని పేరు ఉంది. ట్రబుల్ షూటర్ గా ఆయనకు పేరుంది. 


ఈటెల మాటలను బట్టి హుజూరాబాద్ హుజూరాబాద్ బాధ్యతను కూడా హరీష్ రావుకు అప్పగించే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. ఈ విషయంపైనే మాజీ మంత్రి ఈటెల రాజేందర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. మంగళవారం హుజూరాబాద్ లో మీడియా సమావేశం ఏర్పాటు చేసి మంత్రి గంగుల కమలాకర్ మీద తీవ్రమైన వ్యాఖ్యలు చేసిన ఈటెల రాజేందర హరీష్ రావుపై కూడా మాట్లాడారు. ఈటెల రాజేందర్, హరీష్ రావు మంచి మిత్రులుగా ఉంటూ వచ్చారు. 

తన సహచర మంత్రిని హుజూరాబాద్ ఇంచార్జీ గా నియమిస్తున్నట్లు తెలిసిందని ఈటెల రాజేందర్ అన్నారు. హరీష్ రావును ఉద్దేశించే ఆ మాట అన్నట్లు అర్థమవుతోంది.  "హుజూరాబాద్ రా. ఎక్కడికి వెళ్లినా గెలిపిస్తడనే పేరుంది కదా. ఇది హుజూరాబాద్. ఇక్కడ ప్రజలను ఎవరూ అంచనా వేయలేరు. 20 ఏళ్లుగా నాతో ఉన్నారు. కరీంనగర్ లో ఎంపీ అభ్యర్థి ఓడినా హుజూరాబాదులో మెజారిటీ ఇచ్చిన్రు" అని ఈటెల రాజేందర్ అన్నారు.

లోకసభ ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థిగా కరీంనగర్ నుంచి వినోద్ కుమార్ పోటీ చేసి ఓడిపోయారు. హుజూరాబాద్ లో క్యాడర్ తమ వైపు తిప్పుకునే బాధ్యతను కేసీఆర్ వినోద్ కుమార్ కూడా అప్పగించినట్లు తెలుస్తోంది. దానికితోడు, హుజూరాబాద్ శాసనసభ నియోజకవర్గంలో టీఆర్ఎస్ మండల ఇంచార్జీలను నియమించింది. 

హుజూరాబాద్ కు నగర మేయర్ వై సునీల్ రావు ఇంచార్జీగా వ్యవహరిస్తారు. జమ్మికుంట, ఇల్లందు కుంటలకు సుడా చైర్మన్ జీవీ రామకృష్ణా రావును, వీణవంకకు ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణ్ రావును, కమలాపూర్ కు కిమ్స్ రవీందర్ రావును నియమించారు.