ఉన్నత చదువుల కోసం విదేశాలకు వెళ్లేందుకు కొవిడ్‌ టీకా షరతులు

 

ఉన్నత చదువుల కోసం విదేశాలకు వెళ్లేందుకు కొవిడ్‌ టీకా షరతులు వర్తిస్తాయా? టీకా వేసుకోని విద్యార్థుల ప్రవేశానికి ఆయా దేశాలు ససేమిరా అంటున్నాయా? ఒకవేళ కొవిషీల్డ్‌, కొవాగ్జిన్‌ వేసుకున్నా ప్రయోజనం లేదా? ఆ దేశాలు ఆమోదించిన టీకాలు వేసుకుంటేనే ప్రవేశాలకు అనుమతిస్తున్నారా? కొన్ని దేశాలయితే మన విద్యార్థుల ప్రవేశానికి నో చెబుతున్నాయా? పలు విదేశీ విశ్వవిద్యాలయాల్లో ప్రవేశాలకు గడువు ముంచుకొస్తుండటంతో ఇప్పుడు మన విద్యార్థుల్లో ఇదే ఆందోళన నెలకొంది. అమెరికా, బ్రిటన్‌ తదితర దేశాల్లోని వర్సిటీల్లో ఆగస్టులో ప్రవేశాలు మొదలవుతున్న నేపథ్యంలో టీకాలు, వీసాల అనుమతిపై తీవ్ర గందరగోళం నెలకొంది. విదేశాలకు వెళ్లే విద్యార్థులకు కొన్ని విశ్వవిద్యాలయాలు వ్యాక్సినేషన్‌ తప్పనిసరి అని చెబుతుండటంతో అలాంటివారికి కేరళ, మహారాష్ట్ర, ఢిల్లీ ప్రభుత్వాలు అండగా నిలుస్తున్నాయి. తమ రాష్ట్రం నుంచి విదేశాలకు వెళ్లే విద్యార్థుల కోసం ప్రత్యేకంగా వ్యాక్సినేషన్‌ డ్రైవ్‌ నిర్వహిస్తున్నాయి. ఈ విషయంలో మన రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటివరకు ఎలాంటి కార్యాచరణను ప్రకటించలేదు. ఉన్నతవిద్య కోసం మన రాష్ట్రం నుంచి ఏటా దాదాపు 10వేల మంది విద్యార్థులు ఉన్నత చదువుల కోసం అమెరికా, బ్రిటన్‌, ఆస్ట్రేలియా తదితర దేశాలకు వెళుతుంటారు. 18-44 ఏళ్ల మఽధ్య వయసువారికి రాష్ట్రంలో వ్యాక్సినేషన్‌ డ్రైవ్‌ ఊపందుకోకపోవడం.. విదేశీ విశ్వ విద్యాలయాల్లో ప్రవేశాలు మరో రెండు నెలల్లో మొదలుకానున్న నేపథ్యంలో రాష్ట్రానికి చెందిన విద్యార్థుల్లో ఆందోళన నెలకొంది. ఈ తరహా విద్యార్థుల కోసం కేరళ, మహారాష్ట్ర ప్రభుత్వాల మాదిరిగానే రాష్ట్ర ప్రభుత్వం కూడా ప్రత్యేక వ్యాక్సినేషన్‌ డ్రైవ్‌ నిర్వహించాలని కోరుతున్నారు.అండగా నిలుస్తున్న విదేశీ వర్సిటీలు


కరోనా పరిస్థితుల్లో ఉన్నత విద్య కోసం విదేశాలకు వెళుతున్నవారికి అక్కడి యంత్రాంగం అండగా నిలుస్తోంది. ఇతర ప్రయాణికులకు టీకా తప్పనిసరి చేసినా, చదువుకునేందుకు వచ్చినవారికి పలు మినహాయింపులు ఇస్తున్నాయి. ఉన్నతవిద్య కోసం విదేశాలకు వెళ్లే విద్యార్థుల్లో ఎక్కువమంది అమెరికా, బ్రిటన్‌కు ప్రాధాన్యమిస్తారు. అంతర్జాతీయ విద్యార్థుల విషయంలో టీకా నిర్ణయాన్ని అమెరికా ప్రభుత్వం అక్కడి వర్సిటీలకే వదిలేసింది. ఈ మేరకు టీకాలు తీసుకోని విద్యార్థులు కూడా రావొచ్చంటూ పలు వర్సిటీలు వెసులుబాటు కల్పించాయి. అయితే అమెరికాలో దిగాక 10 రోజుల హో క్వారంటైన్‌ తప్పనిసరి అంటున్నాయి.