మాలి అధ్యక్షుడు, ప్రధాని సహా రక్షణ మంత్రిని సైన్యం అరెస్టు

 


మాలి అధ్యక్షుడు, ప్రధాని సహా రక్షణ మంత్రిని సైన్యం అరెస్టు చేసింది. ప్రభుత్వం పునర్యవస్థీకరణ తర్వాత సైన్యం అధ్యక్షుడు బాహ్‌డా, ప్రధాని మంత్రి మోక్టర్‌, రక్షణ మంత్రి సౌలేమనే డౌకోర్‌ను అదుపులోకి తీసుకొని రాజధాని బమాకో వెలుపల కాటిలోని ఓ సైనిక స్థావరానికి తరలించారు. ప్రభుత్వ పునర్వ్యవస్థీకరణలో ఇద్దరు సైనిక సభ్యులు తమ పదవులను కోల్పోయిన కొద్ది గంటల్లోపే అరెస్టు జరిగిందని దౌత్య, ప్రభుత్వ వర్గాలు పేర్కొన్నాయి. కీలక నేతల అరెస్టుతో మాలిలో రాజకీయ సంక్షోభం నెలకొన్నది. మాలిలోని ఐక్యరాజ్య సమితి మిషన్‌ అరెస్టు చేసిన వారిని వెంటనే విడుదల చేయాలని సూచించింది. సమస్యను పరిష్కరించేందుకు ఎకోవాస్ ప్రతినిధి బృందం మంగళవారం బమాకోను సందర్శించనున్నట్లు ఒక సంయుక్త ప్రకటనలో తెలిపింది. బలవంతపు చర్యలను అంతర్జాతీయ సమాజం తిరస్కరిస్తుందని బృందం పేర్కొంది. సైన్యం అదుపులోకి తీసుకున్న నేతలను భేషరతుగా విడుదల చేయాలని యూఎస్‌ స్టేట్‌ డిపార్ట్‌మెంట్‌ సూచించింది.


మాలి తాత్కాలిక ప్రభుత్వం ఈ నెల మొదట్లో రాజీనామా చేసింది. దేశ తాత్కాలిక అధ్యక్షుడు బాహ్‌డా కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని తాత్కాలిక పీఎం మోక్టర్‌ ఓవాన్‌కు ఆదేశాలిచ్చారు. మాజీ రక్షణ మంత్రి అయిన బాహ్‌డా తాత్కాలిక అధ్యక్షుడిగా, మాజీ విదేశాంగ మంత్రి మోక్టర్ ఓవాన్‌ తాత్కాలిక ప్రధానిగా బాధ్యతలు తీసుకున్నారు. 2020 ఆగస్టులో అప్పటి అధ్యక్షుడు ఇబ్రహీం బౌబాకర్ కీతా, ప్రధాన మంత్రి సిస్సేలను అరెస్టు చేస్తున్నట్లు తిరుగుబాటుదారులు ప్రకటించడంతో మాలిలో అస్థిరత నెలకొంది. ఆ తర్వాత అధ్యక్షుడు రాజీనామాను, దేశ పార్లమెంట్‌ను రద్దు చేస్తున్నట్లు ప్రకటించారని స్పుత్నిక్‌ తెలిపింది. ఇదిలా ఉండగా యూఎస్‌ స్టేట్ డిపార్ట్‌మెంట్‌ ట్రావెల్‌ అరెస్ట్‌ జారీ చేసింది. బమాకో నగరంలో ప్రయాణించొద్దని పౌరులకు సూచించింది.